విజయవాడ, మే 9
ఏపీలో ఎన్నికలవేళ ఈ చిన్న రాజకీయ అంశమైన తీవ్ర ప్రభావం చూపడం కామన్. అయితే రెండు పరిణామాలు మాత్రం ఏపీ ప్రజలను చాలా ఆకట్టుకుంటున్నాయి. సీఎం జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతిని కోరడం, ప్రధాని మోదీ రోడ్ షో విజయవాడలో ప్రత్యేక ఆకర్షణగా నిలవడం. పోలింగ్ కు రెండు రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో.. ఈ రెండు అంశాలు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కూటమి తరుపున ప్రచారానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. చిత్తూరు జిల్లా పీలేరులో బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం విజయవాడలో భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. మరోవైపు సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతిని కోరారు. ఎన్నికల అనంతరం బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు సతీసమేతంగా రెడీ అయిపోయారు. దీనికి సంబంధించి కోర్టులోను కూడా అనుమతి కోరారు. గురువారం దీనిపై కోర్టు తీర్పు చెప్పనుంది. అయితే జగన్ విదేశీ పర్యటనపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓటమి భయం ఆయనకు పట్టుకుందని.. రిలాక్స్ అయ్యేందుకు విదేశాలకు వెళ్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన 20 రోజులు పాటు సేవలందించాల్సి ఉందని.. అయినా పాలనను వదిలేసి విదేశాలకు వెళ్లిపోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోవైపు ప్రధాని విజయవాడ రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. కూటమికి పాజిటివ్ గా మారింది. ఐదుగురు ఎస్పీల నేతృత్వంలోని ఐదువేల మంది పోలీసులు బందోబస్తు కల్పించడం విశేషం. పీలేరు సభలో చాలా విషయాలపై స్పష్టత ఇచ్చిన ప్రధాని మోదీ.. విజయవాడ రోడ్ షోలో సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు.. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర నిర్వహించిన రోడ్ షోలో ప్రధానితో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ రోడ్ షో కూటమి పార్టీలకు ఒక ఊపు తెచ్చింది. దీనిపై ఎక్కువ మంది ఆసక్తి చూపారు. ఈ రెండు అంశాల పైనే ఏపీలో ఎక్కువగా చర్చ నడుస్తోంది.