YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కూటమిలో టీడీపీ జోష్...

కూటమిలో టీడీపీ జోష్...

విజయవాడ, మే 9
ఏపీ విషయంలో ప్రధాని మోదీ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేశారు. పేరుకే కూటమి కానీ.. తెర వెనుక బిజెపి అగ్రనేతలు జగన్ కు సహకారం అందిస్తున్నారని ప్రచారం జరిగింది. ఎన్నికల నిర్వహణపరంగా తెలుగుదేశం పార్టీ ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి సహకారం దక్కడం లేదని టాక్ నడిచింది. ఒకానొక దశలో టిడిపి శ్రేణులు తీవ్ర అసంతృప్తికి గురయ్యాయి. బిజెపితో పొత్తు వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుందన్న నిర్ణయానికి వచ్చాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. వరుస పర్యటనలతో ఏపీలో కూటమికి ఒక ఊపు తెచ్చారు. కీలక అధికారులపై వేటువేసి ఎన్నికల నిర్వహణలో కూటమికి తమ సాయం ఉంటుందని సంకేతాలు పంపారు. అదే సమయంలో జగన్ స్వరంలో సైతం మార్పు వచ్చింది. ఎన్నికలు సవ్యంగా జరుగుతాయని తాను అనుకోవడం లేదని.. అధికారులపై వరుస పెట్టి బదిలీల వేటు వేయడం ఏమిటని ప్రశ్నించారు. జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం మరుక్షణం టిడిపిలో సంతృప్తి ప్రారంభమైంది.మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత గత నెలలో చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆ సభలో జగన్ సర్కార్ పై ప్రధాని మోదీ విరుచుకుపడతారని భావించారు. కానీ పొడి పొడి మాటలకే ఆయన పరిమితమయ్యారు. దీంతో రకరకాల ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. కూటమిపై ప్రధాని పెద్దగా ఆసక్తి చూపడం లేదని.. జగన్ పై ఇప్పటికీ అభిమానంతోనే ఉన్నారని సోషల్ మీడియా హోరెత్తింది.అదే సమయంలో టిడిపి అభ్యంతరాలు తెలిపిన అధికారులపై ఎటువంటి బదిలీ వేటు పడలేదు. ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి మూడు దశల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో పోలింగ్ జరిగింది. ఆ రాష్ట్రాలన్నీ బిజెపికి కీలకం. పైగా గత రెండు ఎన్నికల్లోబిజెపి గెలవడంతో.. సహజంగానే అక్కడ వ్యతిరేకత ఉంటుంది. అందుకే ప్రధాని మోదీ తో పాటు హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా అక్కడ దృష్టి పెట్టారు. వరుస పర్యటనలతో హోరెత్తించారు. అటు బిజెపి పాలిత రాష్ట్రాలు కావడంతో.. వారు ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. కానీ ఆ స్థాయిలో ఏపీలో పర్యటించకపోయేసరికి రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కానీ నాలుగో విడత పోలింగ్ జరిగే తెలుగు రాష్ట్రాలపై ఇప్పుడు బిజెపి నాయకులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అందులో భాగంగానే అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు చేశారు. తరువాత ప్రధాని వచ్చి భారీ బహిరంగ సభలతో పాటు రోడ్ షోలో పాల్గొన్నారు. అదే సమయంలో వివాదాస్పద అధికారులపై బదిలీ వేటు పడింది. ఈ పరిణామాలతో తెలుగుదేశం పార్టీ ఖుషి అయింది.ప్రధానంగా బుధవారం విజయవాడలో నిర్వహించిన రోడ్ షో సక్సెస్ అయ్యింది. మునిసిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షోలో ప్రధాని మోదీ తో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వారికి స్వాగతం పలికారు. మూడు పార్టీల శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. ముఖ్యంగా బెజవాడ ప్రాంతం జనసంద్రంగా మారింది. దారి పొడవునా అన్ని వర్గాల ప్రజలు అభిమాన నేతలకు స్వాగతం పలికారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. ఈ రోడ్ షో అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అటు తన ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని, అభిప్రాయాలను పంచుకున్నారు ప్రధాని మోదీ. మొత్తానికైతే ఎన్డీఏ కూటమికి ఒక ఊపు తెచ్చారు ప్రధాని మోదీ.

Related Posts