YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ లోకి అశోక్ బాబు

టీడీపీ లోకి అశోక్ బాబు
మీకు ‘జై సమైక్యాంధ్ర’ ఉద్యమం గుర్తు ఉందా.. ఆ ఉద్యమం అట్టర్ ఫ్లాప్ అయ్యిందనుకోండి అది వేరే విషయం.. కాని ఆ ఉద్యమ ఫలితంగా చాలా మంది నేతలు పేర్లు గట్టిగా వినిపించాయి అందులో ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు పేరును ముద్దుగా ఆరడుగుల బుల్లెట్ అంటూ నేతలు సైతం పదే పదే ప్రస్తావించేవారు. ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రుల లైవ్ ప్రసారాలను సైతం పక్కన పెట్టేసి ఈ ఉద్యమనేత మూతి చుట్టూ మైక్‌లు పెట్టేవారంటే ఆ ఉద్యమంతో అశోక్ బాబు ఎంత ప్రచారంలోకి వచ్చారో అర్థం చేసుకోవచ్చారు. తెలంగాణ ఉద్యమానికి పోటీగా ‘జై సమైక్యాంధ్ర’ రావడం.. ఫైనల్ ఫైట్‌లో కేసీఆర్ దీక్షతో సెంట్రల్ గవర్నమెంట్ కదిలిరావడం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం.. తదనంతర పరిణామాలతో ఏపీలో ఎన్నికలు రావడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నిక కావడం చకాచకా జరిగిపోయాయి. ఇక ఉద్యోగ సంఘం నేతగా ఉంటూనే అధికార పార్టీకి నమ్మిన బంటుగా వ్యవహరిస్తున్నారు అశోక్ బాబు. ఇటీవల కర్ణాటక ఎన్నికలకు సైతం అశోక్ బాబు తన బ్యాచ్‌తో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడానికి ఏపీ ప్రతినిధిగా కర్ణాటకలో మకాం వేశారని బీజేపీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో రేపో మాపో ఏపీ ఎన్జీవో నేత.. టీడీపీ నేతగా మారబోతున్నారనే ప్రచారం గట్టిగానే సాగింది. అయితే అందరూ ఊహించినట్టుగానే అశోక్ బాబుకి చంద్రబాబు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. శనివారం నాడు విజయవాడలో జరిగిన ‘నవ నిర్మాణ దీక్ష’లో అశోక్ బాబుకి పసుపుకార్పెట్ పరిచి మరీ పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. అశోక్ బాబు ఎప్పటి నుండో ప్రజలకు సేవ చేస్తున్నారు. ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తున్నా.. ప్రజాసేవలో పూర్తిగా మునిగిపోయిన అశోక్‌బాబు లాంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం వుందని ఆరడుగుల బుల్లెట్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే పార్టీలోకి రావయ్యా బాబూ.. అని బ్రతిమిలాడినంత పనిచేయడంతో సభకు హాజరైన వాళ్లంగా అవాక్కయ్యారు. ఇక ఎప్పుడెప్పుడు పసుపు కండువా కప్పుకుందామా అని వెయిట్ చేస్తున్న అశోక్ బాబు.. తనను చంద్రబాబు ఎప్పటి నుండో పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని.. అయితే సడెన్‌గా స్టేజ్‌పై ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తారని అనుకోలేదన్నారు. ఇక ముఖ్యమంత్రి గారి సూచన మేరకు త్వరలో నిర్ణయం తీసుకుంటా అంటూ చిరునవ్వులు చిందించారు అశోక్ బాబు. ఇదీ ఈరోజు ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘నవ నిర్మాణ దీక్ష’లో హైలైట్. వచ్చే ఎన్నికల్లో తాను కోరుకున్న చోట ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు అశోక్ బాబు ఇన్నాళ్లు లాబీయింగ్ చేశారని.. చివరికి ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం రావడంతో పసుపు కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారనేది ఇన్ సైడ్ టాక్. 

Related Posts