కడప, మే 9,
కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఆమె గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్యాంపెయిన్ లో ఆమెతో పాటు వైఎస్ సునీత పాల్గొన్నారు. 'ప్రపంచం మొత్తం కడప ఎన్నికల వైపు చూస్తుంది. ఇక్కడ న్యాయం గెలుస్తుందా.?. నేరం గెలుస్తుందా.?. ప్రజలు న్యాయాన్ని గెలిపించాలి. ఓ వైపు వైఎస్ఆర్ బిడ్డ, ఇంకోవైపు వివేకా హత్య కేసు నిందితుడు. అవినాష్ రెడ్డి పదేళ్లు ఎంపీగా ఉండి.. కడప స్టీల్ గురించి పట్టింపు లేదు. కడప స్టీల్ వైఎస్సార్ కల. ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి కడప స్టీల్ కోసం ఒక్క ఉద్యమం చేయలేదు. హత్యలు చేయడానికి అధికారం వాడుకుంటున్నారు. ఢిల్లీకి CBI కోసం పోతున్నాడు. ఇక్కడ ప్రజల కోసం ఒక్కనాడు పోలేదు. సీబీఐ ఆరోపణల ప్రకారమే మేము మాట్లాడుతున్నాం. కాల్ రికార్డ్స్, గూగుల్ మ్యాప్స్, నగదు లావాదేవీలు అన్ని ఆధారాలున్నాయి. వివేకా జగన్ ను కొడుకులా చూశారు. అలాంటి బాబాయిని చంపితే హంతకులను కొడుకే కాపాడుతున్నారు. అరెస్ట్ చేయాలని చూస్తే అవినాష్ రెడ్డిని కర్నూలులో కాపాడారు. జగన్ కి అధికారం ఇచ్చింది అవినాష్ రెడ్డిని కాపాడటానికే. రాష్ట్ర ప్రజల కోసం కాదు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు. ఒకప్పుడు నేను ఆన్న కోసం పాదయాత్ర చేశా. ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డా.' అని షర్మిల పేర్కొన్నారు.
'జైల్లో ఉండే నాయకుడు వద్దు'
: 'కడపలో న్యాయం గెలుస్తుందా? నేరం గెలుస్తుందా?' - అవినాష్ పై షర్మిల తీవ్ర విమర్శలు, జైల్లో ఉండే నాయకుడు అవసరం లేదన్న సునీతషర్మిల ప్రచారంలో పాల్గొన్న డాక్టర్ వైఎస్ సునీతఅవినాష్ రెడ్డిపై విమర్శలు చేశారు. మనకు కడపలో ఉండే నాయకుడు కావాలని.. జైలులో ఉండే నాయకుడు కాదని అన్నారు. 'వివేకాను దారుణంగా హత్య చేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో కోర్టు తీర్పు చాలా ఆలస్యం అవ్వొచ్చు. కానీ, ప్రజా తీర్పు చాలాపెద్దది. ప్రజా తీర్పు కోసం షర్మిల ఎంపీ గా పోటీ చేస్తున్నారు. న్యాయం వైపు షర్మిల నిలబడ్డారు. అవినాష్ రెడ్డికి కనీసం ఓటు అడిగే పరిస్థితి లేదు. ఆయన రేపో మాపో జైలుకు పోతారు. మనకు కడపలో ఉండే నాయకుడు కావాలి. షర్మిలను గెలిపించి వివేకా ఆత్మ కి శాంతి కలిగించండి.' అని సునీత ప్రజలకు పిలుపునిచ్చారు.'నవ సందేహాలు' పేరుతో మరో లేఖమరోవైపు, సీఎం జగన్ కు వైఎస్ షర్మిల 'నవ సందేహాలు' పేరుతో మరో లేఖ రాశారు. ఇటీవల పలు అంశాలపై ప్రశ్నలు సంధిస్తున్న ఆమె.. తాజాగా మరో లేఖలో 9 ప్రశ్నలు సంధించారు. ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టి వినోదం చూస్తున్నారని.. సంక్షేమ పథకాల సాకు చూపి ఆర్థిక అరాచకత్వానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఇంతటి ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం స్వతంత్ర భారతంలో మునుపెన్నడూ చూడలేదేమోనన్న ఆమె.. నిజంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం మీద చిత్తశుద్ది ఉంటే, ప్రజలడిగే ఈ సందేహాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.నవ సందేహాలు
1) ‘బ్రాండ్ ఇమేజ్’ని గంగలో కలిపి, జనంపై ఓ వైపు పన్నుల వాత మరోవైపు అప్పుల మోత.. రూ.12 లక్షల కోట్ల రుణాలతో అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని అపకీర్తిపాలు చేసింది మీరు కాదా?
2) రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 2019-20లో 31.32 శాతంగా ఉన్న ప్రజారుణాలు (పబ్లిక్ డెబ్డ్స్) 2022 - 23 ఆర్థిక సంవత్సరం నాటికి 33.32 శాతానికి పెరగటం మీ చలువ
3) 2020 నవంబరు నాటికే పరిమితిని మించి రాష్ట్రం అప్పులు తెచ్చుకుంటోంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తో పాటు ‘క్రిసిల్’ వంటి సంస్థలు హెచ్చరించినా పరిస్థితిని ఎందుకు చక్కదిద్దలేకపోయారు.?
4) అన్నింటితో పాటు ఆస్తి పన్ను 45 శాతం పెంచారు. ఇంట్లో రోజూ పుట్టే చెత్తకు కూడా కొత్తగా పన్ను వేశారు. దేశంలో ఎక్కడా లేనట్టు పెట్రో ఉత్పత్తులపై మీ పన్ను కింద రూ.70 వేల కోట్లు అదనపు భారం మోపారు, ఇంకా ప్రజలు మిమ్మల్ని మళ్లీ ఎందుకు ఎన్నుకోవాలి?
5) ఆర్థిక అనిశ్చితి, క్రమశిక్షణా రాహిత్యం వల్ల ఎక్కడా అప్పులు పుట్టని పరిస్థితి. కొత్త అప్పు తెస్తే తప్ప జీతాలివ్వలేని స్థితి! అప్పు కోసం వీలున్న ప్రతి తలుపునూ తడుతున్న దయనీయ స్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే మార్గం ఏముంటుందంటారు?
6) రాష్ట్రంలో 70 శాతంగా ఉన్న పన్ను రాబడి కాక పన్నేతర రాబడిని ఏ మాత్రం పెంచుకోకుండా, కేవలం అప్పులపైనే ఆధారపడటం, వివిధ పథకాల కింద కేంద్రం ఇచ్చే నిధుల్ని కూడా అడ్డగోలుగా దారి మళ్లించడం ఏ విధంగా గొప్ప పాలనో చెప్పగలరా ?
7) పంచాయతీ, మున్సిపల్ నిధులు రూ.12 వేల కోట్లు దారి మళ్లించడం రాజ్యాంగం 73, 74 సవరణల స్ఫూర్తికి విరుద్దం కాదా?
8) ఖజానాకు రావాల్సిన నిధుల్ని కార్పొరేషన్లకు మళ్లించి, FRMB పరిమితిని మించి అప్పులు తెచ్చి పుట్టబోయే పిల్లల నెత్తిన సైతం భారం మోపిన మిమ్మల్ని ప్రజలెందుకు క్షమించాలి?
9) ఎస్సీ - ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.లక్ష కోట్ల రూపాయల మేర దారి మళ్లించిన మిమ్మల్ని దళిత, గిరిజన బలహీనవర్గాల ప్రజలు ఎలా నమ్ముతారని మీరనుకుంటున్నారు?.' అంటూ లేఖలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ 'నవ సందేహాలు'ను తీర్చిన తర్వాతనే రాష్ట్ర ప్రజానీకాన్ని ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. అంతవరకూ రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు సీఎం జగన్ కు లేదని అన్నారు.ఁ