రాజమండ్రి, మే 10,
ఏపీలో జగన్ చేజేతులా నష్టాన్ని తెచ్చుకున్నారు. ఫోటోల పిచ్చితో ఎన్నికల ముంగిట విపక్షాలకు ప్రచార అస్త్రాలను అందించారు. అటు న్యాయవాదులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో ఈ అంశం వైరల్ అయింది. ప్రజల భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తున్న ఆరోపణ బలంగా వెళ్తోంది. సీఎం జగన్ కు ఎవరు సలహా ఇచ్చారో? ఎవరు చెప్పారో తెలియదుకానీ.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన ఫోటోలు ఉండాలని భావించారు. పార్టీ రంగులు వేసుకోవాలని చూశారు. అయితే మహిళలకు ఇచ్చే పథకాల నుంచి.. పింఛన్ పుస్తకాల వరకు.. అన్నింటి పైన సీఎం జగన్ బొమ్మ ఉండి తీరాల్సిందే అన్న పంధాను కొనసాగించారు. రంగులు, ఫోటోల విషయంలో ఎప్పటికప్పుడు జగన్ కు చుక్కెదురవుతూ వచ్చింది. ఎన్నికల ముంగిట పట్టాదారు పాసు పుస్తకం పై జగన్ ఫోటో చాలా నష్టం కలిగిస్తోంది. మొన్న ఆ మధ్యన భూ సర్వే కు సంబంధించి కొనుగోలు చేసిన సరిహద్దురాళ్లపై కూడా జగన్ ఫోటో వేశారు. ఏకంగా రాయిపై చిత్తరువులు వేయించారు. పొలానికి వెళ్లే రైతుకు జగనే కనిపిస్తారన్నది ఒక ఆరాటం. దీంతో చేసిన మేలు రైతులు గుర్తుపెట్టుకుంటారని భావించారు. అటు ప్రతి ఇంటా స్టిక్కర్ కూడా అతికించారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇంతవరకు ఓకే కానీ.. తమ ఆస్తి పత్రాలపై జగన్ ఫోటోను వేయడాన్ని మాత్రం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అదే పనిగా విపక్షాలు లేవనెత్తుతుండడంతో రైతులు, ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇప్పుడు ఏపీలో ఎక్కడ విన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వినిపిస్తోంది. భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందన్నది చర్చకు దారితీస్తోంది. గతంలో ఏ ప్రభుత్వము ఇటువంటి సాహసం చేయకపోవడం.. జగన్ దానిని టచ్ చేయడం వివాదంగా మారింది. మీ ఆస్తులు దోచేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. మీ ఆస్తులపై మీ ఫోటోలు కాకుండా.. జగన్ ఫోటోలు వేసుకున్నాడు అంటే అర్థం అదే.. అంటూ చంద్రబాబు, పవన్ లు విరుచుకుపడుతున్నారు. విపక్షాల నుంచి ఎదురవుతున్నఅభ్యంతరాలు ప్రశ్నలకు అధికార పక్షం నుంచి సమాధానం లేకుండా పోతోంది. ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టలేక చేతులు ముడుచుకోవాల్సిన పరిస్థితి వైసీపీకి దాపురించింది.ఇప్పటివరకు ఉన్న సంక్షేమ వాదన, మీ బిడ్డ అనే వాదనలు పక్కకు వెళ్లిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫోటోల రాజకీయం ఇప్పుడు ఏపీలో రంజుగా మారింది. జగన్ కు ఎనలేని నష్టం చేకూర్చేలా మారింది. మీ బిడ్డ మీ బిడ్డ అన్నాడు కాబట్టే.. మీ ఆస్తి తీసుకుంటాడు అంటూ.. అందులో తప్పేముందంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.