విజయవాడ, మే 10,
వైఎస్, కొణిదెల, నారా-నందమూరి.. ఏపీలో ఎన్నికలు ఆ నాలుగు కుటుంబాలే కేంద్రంగా జరుగుతున్నాయి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే వాస్తవం. రేపటిరోజున జయాపజయాలు, వాటి పర్యవసానాల ఎఫెక్ట్ నేరుగా ఆ నాలుగు కుటుంబాల మీదే పడబోతోంది. కానీ.. గ్రౌండ్ లెవల్‌లో కూడా ఇటువంటి ఫ్యామిలీ సర్కస్ ఫీట్లు చాలానే ఉన్నాయి. డజనుకు పైగా కుటుంబాలనుంచి మల్టిపుల్ క్యాండేట్లను బరిలో దింపి.. ఫ్యామిలీ ప్యాక్ పాలిటిక్స్‌ని జోరుగా షురూ చేశాయి ఏపీలో ప్రధాన పార్టీలు.ఒక కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్ ఇవ్వాలనేది రాజకీయాల్లో పాటించాల్సిన నైతిక నిబంధన. కానీ.. అది కాస్తా గాల్లో కలిసిపోయింది. ఒక్కో ఫ్యామిలీకి గరిష్టంగా నాలుగేసి టిక్కెట్లిచ్చి గౌరవించుకుంటూ ముందుకెళ్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. కుటుంబ రాజకీయాలు వద్దువద్దంటూనే ఆ కొన్ని కుటుంబాలకు మాత్రమే పెద్దపీటలేసి గెలుపే పరమావధిగా పావులు కదుపుతున్నాయి.నారా-నందమూరి కుటుంబాలకు చెందిన మొత్తం నలుగురిని పోటీలో దింపింది తెలుగుదేశం పార్టీ. కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి ఆయన తనయుడు లోకేష్ పోటీ చేస్తున్నారు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ మూడోసారి హిందూపురం నుంచి విక్టరీ కోసం ప్రయత్నిస్తున్నారు. బోనస్‌గా బాలయ్య పెద్దల్లుడు శ్రీభరత్ విశాఖ ఎంపీగా టీడీపీ తరఫున బరిలో నిలిచారు. కాకపోతే.. ఈ నలుగురూ.. 2019 ఎన్నికల్లో కూడా ఫైట్ చేసినవాళ్లే.టీడీపీలో ఆ తర్వాత చెప్పుకోవల్సింది యనమల ఫ్యామిలీ ప్యాక్ గురించే. మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూతురు దివ్యకు తుని అసెంబ్లీ టికెట్ ఇప్పించుకున్నారు. కడపలో ఉన్న యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్‌కు ఏలూరు ఎంపీ సీటు దక్కింది. యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ సీటుకు పోటీ చేస్తున్నారు. సో.. టోటల్‌గా యనమల ఖాతాలో నాలుగు టిక్కెట్లు పడ్డట్టు లెక్క.కింజరపు ఎర్రన్నాయుడు ఫ్యామిలీ.. రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు మీద కర్చీఫ్ వేసింది. ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు సిక్కోలు ఎంపీగా హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. ఎరన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు టెక్కలి అసెంబ్లీ సీట్లో బరిలో ఉన్నారు. ఎర్రన్నాయుడు అల్లుడు ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు.సింహపురి రాజకీయాల్లో భార్యాభర్తల సీజన్ నడుస్తోంది. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తుంటే, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి కోవూరు అసెంబ్లీ సీట్లో బరిలో ఉన్నారు. మాజీ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ సెగ్మెంట్‌లో పోటీలో ఉంటే.. ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి బరిలో ఉన్నారు. ఫ్యామిలీ పాలిటిక్స్‌లో టీడీపీ కంటే వైసీపీ నాలుగాకులు ఎక్కువే చదివినట్టుంది. పెద్దిరెడ్డి, బొత్స లాంటి కుటుంబాలకు బంపరాఫర్లు ఇచ్చి.. ఈసారి ఎన్నికల్లో ఫ్యామిలీ స్టార్‌డమ్‌ని రెట్టింపు చేసింది.పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి బరిలో నిలిచారు సీఎం జగన్మోహన్‌రెడ్డి. అటు.. జగన్ కజిన్ బ్రదర్ అవినాష్‌రెడ్డి కూడా కడప ఎంపీగా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కమలాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ మళ్లీ టికెట్ దక్కించుకున్న రవీంద్రనాథ్‌రెడ్డి జగన్‌కి మేనమామ. వైఎస్ ఫ్యామిలీకి మరో సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. సో.. వైఎస్ ఫ్యామిలీ ఖాతాలో వైసీపీ నుంచి ఐదుగురు పోటీలో ఉన్నట్టు లెక్క.చిత్తూరు జిల్లాలో వైసీపీకి పెద్దదిక్కుగా ఉన్న పెద్దిరెడ్డి ఫ్యామిలీ సైతం ఈసారి ట్రిపుల్ ధమాకా కొట్టింది. పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగోసారి పోటీ చేస్తుంటే, ఆయన తనయుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా రెండోసారి బరిలో ఉన్నారు. సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకరానాథ్ రెడ్డి తంబళ్లపల్లి టికెట్ సంపాదించారు. పెద్దిరెడ్డి తర్వాతి ప్లేస్ చెవిరెడ్డి ఫ్యామిలీది. తన చంద్రగిరి సీటును కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి ఇప్పించుకుని, ఒంగోలు ఎంపీగా ప్రమోషన్ తీసుకున్నారు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.కర్నూలు బ్రదర్స్‌గా పేరున్న ముగ్గురికి ఛాన్స్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. వై బాల నాగిరెడ్డి మంత్రాలయం నుంచి, వై వెంకట్రామిరెడ్డి గుంతకల్ నుంచి, వై. సాయిప్రసాద్ రెడ్డి ఆదోని నుంచి ఫ్యాను గుర్తుపై పోటీ చేస్తున్నారు. బోనస్‌గా వీళ్ల బంధువు అనంత వెంకట్రామిరెడ్డికి అనంతపురం ఎంపీ టికెట్ ఇచ్చింది వైసీపీ హైకమాండ్. ఎర్రగొండపాలెం నుంచి రెండుసార్లు గెలిచిన మంత్రి ఆదిమూలపు సురేష్.. ఇప్పుడు కొండపి అసెంబ్లీ టికెట్ తీసుకున్నారు. ఆయన సోదరుడు ఆదిమూలపు సతీష్ కొడుమూరు నుంచి పోటీలో ఉన్నారు. మరో మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి బరిలో ఉంటే.. ఆయన సోదరుడు అంబటి మురళీకృష్ణ పొన్నూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఇటువంటిదే ఉత్తరాంధ్రలో ధర్మాన బ్రదర్స్ తీరు. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, నరసన్నపేట ధర్మాన కృష్ణదాసు పోటీ చేస్తున్నారు.అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఆయన బాబాయ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. వీళ్లిద్దరూ సిట్టింగులే. నెల్లూరు జిల్లాలో మేకపాటి ఫ్యామిలికి సైతం డబుల్ ధమాకా దక్కింది. ఆత్మకూరు నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి నుంచి ఆయన పెదనాన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి పోటీలో ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నుంచి గెలిచి మంత్రిగా అవకాశం దక్కించుకున్న కారుమూరి నాగేశ్వరరావు ఇప్పుడు అదే తణుకు నుంచి పోటీ చేస్తూ.. అదనంగా కుమారుడు సునీల్ కుమార్‌కు ఏలూరు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు.ఇక చివరిగా వైసీపీలో మరో బిగ్ అండ్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ.. విజయనగరం జిల్లాను అడ్డాగా మార్చుకున్న బొత్స కుటుంబం. తనను మూడుసార్లు గెలిపించిన చీపురుపల్లి ఓటర్లనుంచి మరోసారి తీర్పు కోరుతున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఆయన సతీమణి ఝాన్సీ ఈసారి వైసీపీ తరఫున విశాఖ ఎంపీగా బరిలో ఉన్నారు. బొత్స సోదరుడు అప్పల నరసయ్య గజపతినగరం వైసీపీ టికెట్ వరించింది.రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబాల్లో, స్థానికంగా వాళ్లవాళ్ల బలాల్ని బట్టి ఇద్దరికి టికెట్లు ఇచ్చిన సందర్భాలు అనేకం. కానీ.. క్రమంగా ఆ స్కోరు పెరిగి.. ఇప్పుడు పావు డజనుకి మించి అభ్యర్థులకు ఛాన్స్ ఇచ్చాయి పార్టీలు. నేటి రాజకీయాల్లో కష్టపడే నేతలకే ఎంకరేజ్‌మెంట్ అనే కవరింగులు ఇచ్చుకుంటూ ఫ్యామిలీ పాలిటిక్స్‌ని విచ్చలవిడిగా ప్రోత్సహించడం ఒక తప్పనిసరి అలవాటుగా మారింది.