తిరుపతి, మే 11
చంద్రబాబు పని రాక్షసుడు అన్న పేరు ఉంది. రాజకీయంగా చివరి నిమిషం వరకు ఆయన పోరాడుతారు. ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఏడుపదుల వయసులో కూడా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఒకవైపు ఎన్నికల ప్రచార సభలు, మరోవైపు భాగస్వామ్య పక్షాల నేతలతో కలిసి వేదికలు పంచుకోవడం, ఎన్నికల వ్యూహాలు.. ఇలా ఆ వయసులో కూడా కష్టపడి పని చేస్తున్నారు చంద్రబాబు. ఈరోజు ఒక్కరోజే ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొని ఉన్నారు. అంటే రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను టచ్ చేయనున్నారు.ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్యలాంటివి. అందుకే చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వయస్సును లెక్కచేయకుండా గట్టిగానే కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 82 ప్రజాగళం సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈరోజు 5చోట్ల, రేపు మూడు చోట్ల ప్రజాగళం సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 90 సభల్లో పాల్గొన్నట్లు అవుతోంది. చిత్తూరు జిల్లా పలమనేరులో మార్చి 27న ప్రజాగళం సభ ప్రారంభమైంది. రేపటి సభలతో తను అనుకున్న లక్ష్యాన్ని చంద్రబాబు చేరుకోనున్నారు.అయితే చంద్రబాబు ఈ వయసులో కూడా ఉత్సాహంగా సభల్లో పాల్గొనడం ప్రత్యర్థుల అభినందనలు సైతం అందుకుంటున్నారు. అయితే ఒక్క ప్రజాగళం సభలే కాదు.. ప్రధాని మోదీ, అమిత్ షా, పవన్ కళ్యాణ్ తో సైతం వేదికలు పంచుకున్నారు. ప్రైవేట్ కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు వ్యూహాల్లో సైతం చంద్రబాబు క్షణం తీరిక లేకుండా గడిపారు. అయితే టిడిపి కూటమి అధికారంలోకి రాబోతుందని ప్రజల్లోకి సంకేతం పంపడం, టిడిపి శ్రేణుల్లో ధైర్యం నింపడం వంటి వాటిలో చంద్రబాబు కొంత వరకు సక్సెస్ అయ్యారు. అయితే అన్నింటికీ మించి 50 రోజుల వ్యవధిలో 90 సభల్లో పాల్గొనడం ఆషామాషీ విషయం కాదు. ఈ విషయంలో చంద్రబాబుకు అభినందించక తప్పదు.