ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూల్ జిల్లా పర్యటన ఖరారైంది. ఈ మేరకు సీఎం పేషీ నుంచి పర్యటన వివరాలు జిల్లాకు అందాయి. వారం రోజుల పాటు జరిగే నవ నిర్మాణ దీక్ష లో భాగంగా ముఖ్యమంత్రి , అదివారం నాడు జిల్లాకు రానున్నారు. ఉదయం 8.40కు అమరావతిలోని తన నివాసం నుంచి బయలుదేరి 9.05కు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. 9.50కు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుని అక్కడినుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 10.30కు తుగ్గలి మండలం జొన్నగిరి వస్తారు. 10.40 నుంచి 11.10 వరకు జొన్నగిరిలో గ్రామదర్శినిలో భాగంగా బీసీ కాలనీలో పర్యటించనున్నారు. 11.40 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నీరు-చెట్టు కార్యక్రమం, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత రైతులు, గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1.30 వరకు తాగునీటి పథకానికి శిలాఫలకం వేయనున్నారు. రాష్ట్రంలో 5 లక్షల పంట నీటికుంటలు పూర్తి చేసుకున్నందున అక్కడే పైలాన్ను ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత ఫొటో ఎగ్జిబిషన్, వివిధ స్టాళ్లను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి 1.50 వరకు నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా జలహారతి-వాటర్ సెక్యూరిటీ డ్రాట్ ఫ్రూఫ్ స్టేట్, 1.50కు జలహారతి ప్రదేశం నుంచి రోడ్డు మార్గంలో 1.55కు సభకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.15కు హెలికాప్టర్లో బయలుదేరి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు.ఇటు సియం పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసు యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేసింది