విశాఖపట్నం
భారత రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్ని వర్గాలూ ఘోషిస్తున్నాయి. దేశ తలరాతను మార్చే ఈ ఓటు విలువను తెలియజేస్తూ కంచరపాలెం మెట్టు, ముత్యాలమ్మ ఆలయం ఎదురుగా ఉన్న ఓ సెలూన్ షాపు యజమాని వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడి ఆర్కే స్మార్ట్ ది సెలూన్ అధినేత మల్లువలస రాధాకృష్ణ ఓటర్లను చైతన్యం పరిచేలా.. ఓటును సద్వినియోగం చేసుకున్న వారికి తన సెలూన్లో హెయిర్ కట్ ఫ్రీ అంటూ ప్రకటించారు. ఓటుకున్న ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రకటించానన్నారు. ఈ నెల 13న సోమవారం ఓటేసి వచ్చిన వారికి ఉచితంగా హెయిర్ కట్ చేస్తామన్నారు.