కాకినాడ, మే 11
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల అంకం చివరి దశకు చేరుకుంది. శనివారంతో ప్రచారం కూడా ముగియనుంది. దీంతో నాయకులు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు. పోలింగ్‌కు రెండు రోజులు మాత్రమే ఉండటంతో ప్రజలను మభ్య పెట్టేందుకు మద్యం, నగదును ఆయుధాలుగా వాడుతుంటారు. దీంతో నియోజకవర్గాలకు డబ్బును చేర్చే పనిలో పడ్డారు రాజకీయ నాయకులు. పోలీసుల కంట పడకుండా నగదును తరలించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు నేతలు. వాటిని పట్టుకునేందుకు పోలీసులు కూడా చెక్ పాయింట్స్‌ను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని చెక్ చేస్తుంటారు.తాజాగా పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇది ఏ చెక్ పాయింట్లోనో పట్టుపడింది కాదు. దురదృష్టం వెంటాడితే దొరికిన నగదు. సినీ తరహాలో తరలిస్తున్న డబ్బు యాక్సిడెంట్ ద్వారా బయటపడింది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. దీంతో టాటా ఏస్ వాహనం బోల్తా పడింది.ఈ వాహనంలో తవుడు బస్తాల మధ్య అట్టపెట్టల్లో దాదాపు ఏడు కోట్ల రూపాయలు తరలిస్తున్నారు. వాహనం బోల్తా కొట్టడంతో అట్ట పెట్టల్లోని నగదును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మొత్తం దాదాపు ఏడు కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. అటు బోల్తా పడిన టాటా ఏస్ వాహన డ్రైవర్‌కు గాయాలయ్యాయి. దీంతో అతన్ని పోలీసులు గోపాలపురం ఆస్పత్రికి తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.విజయవాడ నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా పట్టుబడ్డ నగదు ఎవరు తరలిస్తున్నారు.. ఎక్కడికి తరలిస్తున్నారు అనేది ఇంకా తెలియరాలేదు. డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.