న్యూఢిల్లీ, మే 14
ఫ్రాన్స్లో ఈనెల 25 వరకు జరుగనున్న 77వ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో భారతదేశం ప్రాతినిధ్యం ఉంటుందని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని భిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలను సెలబ్రేట్ చేసేలా భారత్ పర్వ్’ పేరిట భారత పర్యాటక శాఖ దేశంలో వేడుకలు నిర్వహిస్తుంది. ఈ వేడుకలను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ నిర్వహించనున్నారు.భారత్ పర్వ్ పేరిట కాన్స్ చిత్రోత్సవాల్లో ఓ విభాగం ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. ఈ చిత్రోత్సవాల్లో భారత్ పెవిలియన్ పేరిట ఓ స్టాల్ ఏర్పాటు చేస్తారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎఫ్డీసీ), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్ఐసీసీఐ) ఈ స్టాల్ను నిర్వహిస్తాయి. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరుగనున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ) విశేషాలు, ఈ వేడకల్లో జరుగనున్న వరల్డ్ ఆడియో – విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ గురించిన వివరాలను కూడా భారత పర్వ్ సెలబ్రేషన్స్లో భాగంగా వెల్లడించనున్నట్లు భారత సమాచార మంత్రిత్వ శాఖ పేర్కొంది.భారత దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సినీ రంగానికి చెందిన అన్ని విభాగాల ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది. దేశానికి చెందిన ప్రతిభ గల ఫిల్మ్ మేకర్స్ ఈ వేడుకలను ఓ వారధిగా చేసుకుని ప్రపంచ ఫిల్మ్ మేకర్స్కు భారత్ పర్వ్లో తమ ప్రాజెక్టులను, తమను మార్కెటింగ్ చేసుకునే వీలు ఉంటుంది. ఇందుకోసం భారత పెవిలియన్ స్టాల్లో భారతీయ సినీ సమాఖ్య ప్రతినిధులు ఉంటారు.ఇదిలా ఉంటే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోని ప్రతిష్టాత్మక విభాగం ఫామ్ డి ఓర్లో భారత్కు చెందిన పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్ పోటీ పడుతుంది. అలాగే అన్ సర్టైన్ విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ సంధా సూరి తీసిన సంతోష్ పోటీలో ఉంది. డైరెక్టర్స్ ఫోర్ట్నైట్ విభాగంలో ఇండియన్ ఫిల్మ్ మేకర్ కరణ్ గంధారి తీసిన సిస్టర్ మిడ్నైట్, అసోసియేషన్ ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా విభాగంలో మైసమ్ అలీ తీసిన ఇన్ రిట్రీట్ ఉన్నాయి. అలాగే ది ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా విద్యార్థులు తీసిన షార్ట్ ఫిల్మ్ సన్ ఫ్లవర్స్ వేర్ ది ఫస్ట్ వన్స్ టు నో పోటీలో ఉంది. జాతీయ అవార్డు గ్రహీత, కెమెరామెన్ సంతోష్ శివన్ ఈ చిత్రోత్సవాల్లో పియర్ ఏంజెనీ అవార్డు అందుకోనున్నారు. దివంగత ఫిల్మ్ మేకర్ శ్యామ్ బెనగల్ తీసిన మంథన్ చిత్రం ప్రదర్శించనున్నారు. ఇలా ఈ ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారత్ హవా బాగానే ఉండనుంది.