YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫ్యామిలీ వెకేషన్ కు లీడర్లు

ఫ్యామిలీ వెకేషన్ కు  లీడర్లు

గుంటూరు,  మే 15,
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అంతా ఫలితాలపైనే టెన్షన్. కానీ ఫలితాల కోసం మరో ఇరవై రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. గత మూడు నెలల నుంచి నేతలు టెన్షన్ పడ్డారు. దీంతో చాలా మంది నేతలు కొద్ది రోజుల పాటు ఫ్యామిలీ వెకేషన్ కు వెళుతున్నారు. కొందరు నేతలు ఎక్కవగా హైదరాబాద్ కు వచ్చేస్తున్నారు. మరికొందరు నేతలు ఊటీ, కొడైకెనాల్ వంటి పర్యాటక ప్రదేశాలకు వెళుతున్నారు. ఇంకొందరు నేతలు అయోధ్య వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లి కొంత మనశ్శాంతితో గడిపేందుకు నిర్ణయించుకున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇళ్ల వద్ద కార్యకర్తల తాకిడి ఎక్కువ కావడంతో వాటిని తట్టుకోలేక వీరు సొంత నియోజకవర్గాలను వదిలి ఫ్యామిలీతో గడిపేందుకు వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీల నేతలు టిక్కెట్ వచ్చేంత వరకూ ఒక టెన్షన్ పడ్డారు. టిక్కెట్ ఖరారయినా బీఫారం చేతికందే వరకూ టెన్షన్. బీఫారం అందితే నామినేషన్ సక్రమంగా పూర్తవుతుందా? లేదా? అన్న టెన్షన్.. ఆ తర్వాత అయితే.. టిక్కెట్ వచ్చిన తర్వాత పార్టీలో నేతలను మచ్చిక చేసుకోవడం మరింత టెన్షన్ గా మారింది. ప్రధానంగా ఒకే పార్టీలో ఉన్న నేతలు అలకలు, అసంతృప్తులు తీర్చడానికి కొంత సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. ఇక ప్రచారంలో అంతా టెన్షన్. అగ్రనేతల పర్యటనలకు జనాన్ని సమీకరించడం ఒక టెన్షన్. చేతిలో ఉన్న డబ్బులు అయిపోవడంతో.. మిగిలిన డబ్బులు ఎక్కడి నుంచి తేవాలన్న టెన్షన్ ఇలా.. దాదాపు మూడు నెలల నుంచి లీడర్ల బీపీ మాత్రం హైలెవెల్లోనే ఉందన్నది వాస్తవం. అయితే ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు ఆ టెన్షన్ లన్నీ ఒకింత పక్కన పెట్టి సేదదీరాలని వెళతున్న నేతలకు మరో టెన్షన్ పట్టుకుంది ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అంచనాలు ఎవరికీ అందడం లేదు. ఎక్కువ నియోజకవర్గాల్లో టగ్ ఆఫ్ వార్ గా ఎన్నిక జరిగింది. గెలిచినా ఓడినా స్వల్ప ఓట్ల మెజారిటీతోనే సాధ్యమని తేలడంతో పాటు ఓటరు నాడి కూడా ఈసారి అందకుండా పోవడంతో నేతలకు నిద్ర పట్టడం లేదు. కోట్లు కుమ్మరించిన నేతలు తమ డబ్బులు ఓటర్లకు చేరాయా? లేదా? అన్న టెన్షన్ ఒకటయితే.. ఓటరు డబ్బులు తీసుకుని ఓటేశారా? లేక ముందుగానే డిసైడ్ అయినట్లు బటన్ నొక్కాడా? అన్న అనుమానం మాత్రం నేతలను వీడటం లేదు. ఇక కౌంటింగ్ రోజు కూడా ఏజెంట్లు కావాలి. నమ్మకమైన, బలమైన ఏజెంట్లు అవసరం. వారిని మచ్చిక చేసుకోవాలి. అందుకోసం మరో పది రోజులు వేచి చూద్దామని భావించిన నేతలు ఇప్పుడు ఎక్కువ మంది టూర్లు ప్లాన్ చేసుకున్నారు. ఫ్యామిలీతో గడిపి వస్తే కొంత టెన్షన్ తీరుతుందని, తర్వాత వచ్చి నియోజకవర్గంలో పనులు చూసుకోవచ్చన్న భావన వారిలో కనపడుతుంది. మొత్తం మీద ఈవీఎంలలో నిక్షిప్తమైన తమ భవితవ్యం ఏమవుతుందోనన్న టెన్షన్ మాత్రం నేతలను వదిలిపెట్టడం లేదు.

Related Posts