విజయవాడ
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు పోటెత్తారు.. గత రికార్డులను తిరగరాసి మరీ పోలింగ్ బూత్లకు క్యూకట్టారు జనం. మరి పోటెత్తిన ఓటు ఎవరికి పడింది.. పోటు ఎవరికి పడింది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎవరికి వారు విశ్లేషణలతో తమకే అనుకూలమంటూ పార్టీలు ప్రకటిస్తున్నాయి. అటు కాయ్రాజాకాయ్లకు కూడా అంతచిక్కని ఏపీ నాడి.. ఎవరికి పట్టం కట్టబోతుంది.
2019 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ 79.74 శాతం… కానీ ఈ రికార్డును కూడా తిరగరాసి 80శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. ఓటర్లలో చైతన్యం పెరిగింది.. తమ హక్కును గుర్తించారు. ఫలితంగానే పోస్టల్ బ్యాలెట్ నుంచి బూత్ల వరకూ పోటెత్తారు. పెరిగిన ఓటింగ్ ప్రభుత్వానికి అనుకూలంగా పడిందా.. లేక వ్యతిరేకంగా పడిందా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై పార్టీలు ఎవరికి వారు తమవద్ద ఉన్న లెక్కలతో అంచనాలపై కుస్తీ పడుతున్నాయి.
అధినేత చంద్రబాబునాయుడు. దేశవ్యాప్తంగా మోదీ హవాతో పాటు.. రాష్ట్రంలో ఎన్డీయే భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు చంద్రబాబునాయుడు.అర్థరాత్రి వరకూ మహిళలు క్యూలో ఉండి మరీ ఓట్లు వేశారని.. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్లే మళ్లీ ఆశీర్వదించారని వైసీపీ బలంగా నమ్ముతోంది. గెలుపోటములపై చర్చలు నడుస్తుండగానే అటు అధికారులపై పార్టీల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. కొందరు అధికారులు టీడీపీతో కుమ్మక్కుయ్యారని మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇప్పటికీ కొందరు అధికారులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పద్దతి మార్చుకుని బ్యాలెట్ బాక్సులను కాపాడాలన్నారు మాజీమంత్రి బుచ్చయ్యచౌదరి.
మొత్తానికి ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో అభ్యర్థులంతా ఎవరి ధీమాలో వారు ఉన్నారు. పార్టీలు కూడా అధికారపీఠం మాదేనంటూ ప్రచారం చేస్తున్నాయి. మరి ఎవరికి జనం పట్టం కట్టారు. మరెవరికి పాఠం నేర్పారన్నది చూడాలి.