YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నేతల్లో క్రాస్ ఓటింగ్ భయం

నేతల్లో క్రాస్ ఓటింగ్  భయం

విజయవాడ, మే 16,
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అయితే ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న ఫీడ్ బ్యాక్ తో నేతల కంటి మీద కునుకు లేకుండా పోయింది. అసెంబ్లీకి ఒక గుర్తుపైన ఓటు వేసిన వారు పార్లమెంటుకు వచ్చేసరికి మరో గుర్తుపై వేశారంటున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఏజెంట్లు, ముఖ్య కార్యకర్తల నుంచి వచ్చిన సమాచారంతో క్రాస్ ఓటింగ్ పెద్దయెత్తున జరిగిందని చెబుతున్నారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పెద్దయెత్తున క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది.  తూర్పు గోదావరి జిల్లాలో కూటమి తరుపున మూడు పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగారు. మూడు గుర్తులు ఓటర్లకు చెప్పడానికి నేతలు కొంత కష్టపడాల్సి వచ్చింది. ఇంటింటి ప్రచారంలోనూ ఎవరికి వారే తమ గుర్తును ప్రచారం చేసుకుని వెళ్లారు. మూడు గుర్తులు చెబితే ఓటర్లు కన్ఫ్యూజన్ కు గురవుతారని భావించి మూడు పార్టీలూ కూడా ఒక గుర్తు ను మాత్రమే ప్రచారం చేసి వెళ్లారు. అయితే కొన్ని చోట్ల రెండు గుర్తులకు ఓటు వేయాల్సి వచ్చింది. ఇది ఇబ్బందిగా మారింది. కాకినాడ పార్లమెంటుకు జనసేన అభ్యర్థి పోటీ చేయగా, రాజమండ్రి పార్లమెంటు నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు. అంటే ఈ పార్లమెంటు పరిధిలోని శాసనసభ నియోజవర్గాలు రెండు గుర్తులను గుర్తుపెట్టుకుని మరీ ఓటువేయాల్సిన పరిస్థితి ఉంది.  అందుకే ఎన్నికల తర్వాత నేతలు జరుపుతున్న విశ్లేషణలలో ఇవన్నీ బయటపడుతున్నాయి. ఓటర్లు తాము ఆ గుర్తుకు వేయలేదని చెబుతుండటంతో క్రాస్ ఓటింగ్ జరిగిందని భావిస్తున్నారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో వైసీపీ నుంచి పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ మూడు సార్లు వివిధ పార్టీల నుంచి ఓటమి పాలయి కొంత సానుభూతిని కూడగట్టుకున్నారంటున్నారు. ఆయన అనేక మందికి ఉపాధి కూడా తన సంస్థల్లో కల్పించడంతో పాటు ప్రత్యర్థి కొత్తవాడు కావడంతో జనం అటు వైపు మొగ్గు చూపారంటున్నారు. అందుకే కాకినాడ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజవర్గం పరిధిలో ఎక్కువ క్రాస్ ఓటింగ్ జరిగిందన్న లెక్కలు బయటకు వస్తున్నాయి. దీంతో వైసీపీ అభ్యర్థి ఇక్కడ గెలిచినట్లేనని పెద్దయెత్తున బెట్టింగ్ లు కూటమిలోని ఒక పార్టీకి చెందిన నేతలే కడుతుండటంతో అనుమానం మరింత బలపడుతుంది.  అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి పోటీ చేసిన రాజమండ్రి స్థానంలో కొన్ని వైసీపీ ఓటు బ్యాంకు నుంచి కూడా ఆమెకు పడినట్లు చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్ కుమార్తెగానే కాకుండా మహిళ కావడంతో ఎక్కువ మంది మహిళలు అసెంబ్లీకి వైసీపీకి ఓటు వేసిన వారు కూడా పార్లమెంటుకు వచ్చేసరికి బీజేపీకి వేశారంటున్నారు. అయితే వైసీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కూడా మంచి వ్యక్తి. అందరికీ సుపరిచితుడు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయనకు మంచి పేరుంది. అందుకే డాక్టర్ కు కాదని బీజేపీకి ఓటు వేయకుండా అనేక మంది టీడీపీ సానుభూతి పరులు కూడా బటన్ నొక్కరంటున్నారు. అందుకే రాజమండ్రి పార్లమెంటు ఫలితం మాత్రం చివర వరకూ ఉత్కంఠగానే సాగుతుందంటున్నారు. ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ భయం మాత్రం పట్టుకుంది. మరి ఇది నిజమా? అబద్ధమా? ప్రచారమా? అన్నది జూన్ 4వ తేదీన తేలనుంది.

Related Posts