విజయవాడ, మే 16
వైసీపీ ఫైర్ బ్రాండ్ల పరిస్థితి ఏమిటి? ఎన్నికల్లో గెలుపు పొందుతారా? ఓటమి చవిచూస్తారా? ఒకవేళ ఓడిపోతే వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏపీలో ఇదో ఆసక్తికర రాజకీయ పరిణామంగా మారింది. ఎక్కడ చూసినా వారిపైనే చర్చ జరుగుతోంది. ఎక్కువమంది ఆరా తీయడం కనిపిస్తోంది. మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లు వైసీపీలో ఫైర్ బ్రాండ్లుగా ముద్రపడ్డారు. అధినేత పై ఈగ వాలనిచ్చేవారు కాదు. రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత కామెంట్లకు దిగేవారు. గత ఐదేళ్లుగా అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచేవారు. అందుకే వారి పరిస్థితి ఎలా ఉందో అని ఎక్కువమంది ఆరా తీస్తున్నారు.మంత్రి రోజా నగిరి నుంచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. కానీ వాస్తవం ప్రతికూలంగా ఉంది ఆమెకు. పోలింగ్ నాడే ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీతో తనకు ఇబ్బంది లేకుండా.. సొంత పార్టీ వారే తనను ఓడించడానికి సిద్ధపడ్డారని చెప్పడం ద్వారా.. ముందుగానే ఓటమిని అంగీకరించారు ఆమె. అక్కడ రోజాకు టికెట్ ఇవ్వద్దని వైసీపీకి చెందిన నేతలే హై కమాండ్ కు కోరారు. కానీ జగన్ అవేవీ పట్టించుకోలేదు. రోజా కి టికెట్ ఇచ్చారు. కానీ అసమ్మతి నాయకులను రోజా కలుపుకొని వెళ్లలేదు. ప్రచారానికి కూడా పిలవలేదు. తీరా ఇప్పుడు పోలింగ్ ముగిశాక వారు సహకరించలేదని చెప్పడం ద్వారా రోజా ఓటమిని అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.కొడాలి నాని 2004 నుంచి గుడివాడలో గెలుపొందుతూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొంది రికార్డ్ సృష్టించాలని భావిస్తున్నారు. కానీ ఈసారి అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పట్టు బిగించింది. బలమైన అభ్యర్థిని బరిలో దించింది. ప్రభుత్వంపై వ్యతిరేకత మరోవైపు, కొడాలి నాని ఓడించాలని టిడిపి కలిసి ఇంకోవైపు గట్టిగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అత్తెసరు మెజారిటీతో మాత్రమే నాని గెలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ప్రభావం చూపితే ఓటమి కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.మంత్రి అంబటి రాంబాబు పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఆయన సత్తెనపల్లి నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. కానీ ఈసీ అంతగా పని చేయడం లేదని.. టిడిపికి అనుకూలంగా పనిచేసినట్లు మీడియా ముందుకు వచ్చి ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ ఓటమి తప్పదని సంకేతాలు ఉన్నాయి. పోలింగ్ సరళి కూడా మారడంతో అంబటిలో ఆందోళన ప్రారంభమైంది. అందుకే ఓటమికి కుంటి సాకులు వెతుక్కుంటున్నారని టిడిపి చెబుతోంది.
గుడివాడ అమర్నాథ్ పరిస్థితి కూడా అలానే ఉంది. గత ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన అమర్నాథ్కు విస్తరణలో జగన్ మంత్రి పదవి ఇచ్చారు. కానీ గ్రాఫ్ బాగాలేదని చెప్పి అనకాపల్లి నుంచి గాజువాక కు మార్చారు. అయితే అక్కడ టిడిపి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ బలంగా ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఒకవైపు, వైసీపీలో గ్రూపులు మరోవైపు కలవర పెడుతున్నాయి. అమర్నాథ్ ఎదురీదుతున్నట్లు తెలుస్తోంది.మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గా ఉన్న ఆయన గ్రాఫ్ తగ్గిందని.. నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి జగన్ పోటీ చేయించారు. అయితే అక్కడ కూడా ఏమంత పరిస్థితి బాగా లేదన్నట్లు తెలుస్తోంది. లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో అనిల్ కు ఓటమి తప్పదని సంకేతాలు వస్తున్నాయి. అటు పోలింగ్ తర్వాత అనిల్ చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలం చేకూర్చాయి. వారు ఏపీ పోలీసులా? టిడిపి కార్యకర్తలా? అని ప్రశ్నించడం ద్వారా ఓటమి భయాన్ని బయట పెట్టుకున్నారు జగన్.ఇక అత్యంత వివాదాస్పదులుగా ఉన్న ఫైర్ బ్రాండ్ల జాబితాలో దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ మోహన్, సిదిరి అప్పలరాజు వంటి వారు సైతం ఓటమి బాటలో ఉన్నట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థుల చేతిలో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, వారి వ్యక్తిగత వైఖరితో చేజేతులా నష్టపోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే వైసీపీ ఫైర్ బ్రాండ్లు వెనుకబడిపోయినట్లు తేలడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.