తిరుపతి, మే 16,
మొన్నటి వరకూ ఎన్నికల ప్రచారాలతో మోతెక్కిన తిరుపతి నగర విధులు.. ఇవాళ్టి నుంచి ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో జరిగే ప్రముఖ జాతరల్లో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతీ ఏటా మే నెలలో ఏడు రోజుల పాటు జాతర నిర్వహించటం జరుగుతుంది. నిన్న అర్థరాత్రి చాటింపుతో తిరుపతి గ్రామ దేవతగా పిలుచుకొనే చిన్నగంగమ్మ జాతర గ్రాండ్‌గా ప్రారంభమైంది. 21వ తేదీ వరకు ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. 22వ తేదీన తెల్లవారు జామున అమ్మవారి విశ్వరూప దర్శనం, చెంప నరికే కార్యక్రమంతో జాతర ముగియనుంది. ఏడు రోజుల పాటు వివిధ వేషాలలో గంగమ్మను భక్తులు దర్శించుకోనున్నారు.సంప్రదాయం ప్రకారం కైకాల వంశస్తులు తిరుపతి గంగజాతర సందర్భంగా అర్థరాత్రి గ్రామంలో చాటింపు పూజ నిర్వహించి నగర శివారు ప్రాంతాలలో అష్టదిగ్భంధనం చేసి చాటింపుతో జాతరకు శ్రీకారం చుట్టారు. జాతర ప్రారంభం కావడంతో అమ్మవారి అనుగ్రహం పొందేందుకు పూజలు నిర్వహిస్తారు. ఇవాళ బైరాగివేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు. రేపు బండ వేషం, 17న తోటి వేషం, 18న దొర వేషం, 19న మాతంగి వేషం, 20న సున్నపు కుండలు, 21న గంగమ్మకు చప్పరం కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక 22న విశ్వరూప దర్శనం తర్వాత చెంప నరికే కార్యక్రమంతో జాతర ముగుస్తుంది.అలాగే తిరుపతి గ్రామ దేవత గంగమ్మ జాతరలో మరో విశేషం ఉంది. జాతర జరిగినన్ని రోజులు గ్రామస్తులు ఊరి విడిచి వెళ్లరు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా రాత్రుళ్లు బస చేయకుండా వెళ్లిపోవడం ఇక్కడి ఆచారం. తాతయ్యగుంట గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మ.. సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలుగా కొలుస్తారు.గంగమ్మ జాతర ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. తిరుపతి కార్పొరేషన్ కమిషనర్‌తోపాటు డీఆర్వోను సమన్వయం చేసుకుని ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా జాతర సందర్భంగా శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. జాతర ముగింపు రోజు భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.