YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆర్టీసీ బస్సుపై దాడి,,,

ఆర్టీసీ బస్సుపై దాడి,,,

హైదరాబాద్, మే 16
అల్లరిమూకలు చెలరేగిపోయారు. సైడ్‌ ఇవ్వలేదంటూ ఆర్టీసీ బస్సుపై తమ ప్రతాపం చూపించారు. అడ్డొచ్చిన ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు… సుమారు 50 మంది యువకులు బస్సుని ఆపి అద్దాలు పగులగొట్టి హల్‌చల్‌ చేశారు. హైదారాబాద్‌ శివారు రాచులూర్ గేట్‌ వద్ద జరిగిందీ ఘటన. కల్వకుర్తి డిపో బస్సును బైక్‌పై వెళ్తున్న కొందరు యువకులు టార్గెట్‌ చేశారు. ఎంతసేపు హారన్‌ కొట్టినా సైడ్‌ ఇవ్వట్లేదంటూ బస్సుని వెంబడించి, ఆపి మరి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. హారన్‌ కొడితే సైడ్‌ ఇవ్వడం తెలీదా అంటూ డ్రైవర్‌, కండక్టర్‌పై దాడికి యత్నించారు. అడ్డొచ్చిన ప్రయాణికులనూ ఇష్టం వచ్చినట్లు దూషించి, వారిని భయబ్రాంతులకు గురిచేశారు. బస్సుని ఆపడమే కాదు మరికొందరికి ఫోన్‌ చేసి రప్పించి నడిరోడ్డుపైనే హంగామా సృష్టించారు. అల్లరిమూకల దాడి ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. డ్రైవర్‌, కండక్టర్‌ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డ్రైవర్‌, కండక్టర్‌ తమ ఫోన్‌లో తీసిన ఫోటోలు, బైక్‌ నంబర్ల‌ ఆధారంగా యువకుల కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్ శివారులో రాచలూరు గేట్ వద్ద కల్వకుర్తి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సుపై కొందరు దుండగులు బైక్‌లపై వచ్చి దాడి చేశారు. బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. అయితే దీనిపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ (ట్విట్టర్‌) లో స్పందించారు. ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకెళ్తున్న తమ బస్సులపై కారణాలు లేకుండా దాడులు చేయడాన్ని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ మహేశ్వరం పీఎస్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారని.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. బస్సుల ప్రజల ఆస్తి అని.. వాటిని రక్షించుకోవాల్సింది కూడా ప్రజలేనని సజ్జనార్ అన్నారు. పోలీసుల సహాకారంతో నిందితులపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని.. బస్సు డ్యామేడీ ఖర్చులు వారి నుంచి వసూలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

Related Posts