విజయవాడ, మే 17
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాక మునుపే.. రకరకాల చర్చ నడుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీకి నేతల హాజరు చుట్టూనే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు గెలిస్తే జగన్ విపక్షనేతగా అసెంబ్లీకి వస్తారా? జగన్ గెలిస్తే చంద్రబాబు రాగలరా? పవన్ పాత్ర ఏంటి? లోకేష్ ఏం చేస్తారు? ఇటువంటివి హాట్ టాపిక్ గా మారాయి. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. తమ గొంతు నొక్కుతుందని వైసీపీ సభ్యులు శాసనసభకు హాజరు కాలేదు. నిండు సభలో తన భార్యను అవమానించారని చంద్రబాబు శాసనసభను బాయ్ కట్ చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి గానే హౌస్ లో అడుగు పెడతానని శపధం చేశారు.అయితే సీఎం అయితేనే చంద్రబాబు శాసనసభలో అడుగు పెట్టగలరు. అటు జగన్ ది అదే పరిస్థితి. అంటే అధికారంలోకి వస్తేనే వారు హౌస్ లో అడుగుపెట్టే ఛాన్స్ ఉందన్నమాట.శాసనసభ అన్నది ప్రజాస్వామ్యంలో ఒక దేవాలయం లాంటిది. ప్రజా సమస్యలు ప్రస్తావనకు వచ్చేది అక్కడే. వాటికి పరిష్కార మార్గందక్కేది అక్కడే. కానీ అటువంటి శాసనసభ సమావేశాలను బహిష్కరించి ప్రజా సమస్యలను గాలికి వదిలేసారన్న విమర్శలు ఉన్నాయి. 2014లో టిడిపి గెలిచిన తర్వాత.. వైసీపీ ఎమ్మెల్యేలపై వేటుపడింది. రోజా లాంటిఎమ్మెల్యేలపై శాశ్విత వేటు వేశారు. దీనిని నిరసిస్తూ నాడు జగన్ మొత్తం శాసనసభనే బహిష్కరించారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాతే హౌస్ లో అడుగు పెడతానని తేల్చి చెప్పారు. అందుకు తగ్గట్టుగానే గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత హౌస్ లో అడుగు పెట్టారు.2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. అంతకుముందు తనకు ఎదురైన ప్రతి పరిణామాన్ని రిపీట్ చేశారు. హౌస్ లో టిడిపి సభ్యులను ముప్పు తిప్పలు పెట్టించగలిగారు. ఒకానొక దశలో చంద్రబాబు వ్యక్తిగత జీవితంపై, సతీమణి పై వైసీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. చంద్రబాబు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అసెంబ్లీలోనే శపథం చేశారు. మళ్లీ తాను సీఎం గానే హౌస్ లో అడుగు పెడతానని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు కూటమి గెలిస్తే ఆయన శపథం తప్పకుండా నెరవేరుతుంది. ఒకవేళ ఓటమి ఎదురైతే మాత్రం.. ఆ బాధ్యతను పవన్ కైనా.. లోకేష్ కైనా అప్పగించే అవకాశం ఉంది. పొరపాటున వైసిపి ఓడిపోతే మాత్రం జగన్ వచ్చే పరిస్థితి ఉండదు. అంతకుముందు తన నుంచి ఎదురైన పరిణామాలు.. తనకు తిరిగిగుచ్చుకుంటాయని తెలుసు. అందుకే జూన్ 4న ఫలితాలు కేవలం అధికారం కోసమే కాదు.. ఒకరిపై ఒకరు ఉక్కు పాదం మోపేందుకే నన్న విషయం అందరికీ తెలిసిందే.