YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాన్ఫిడెన్స్ అంతా అదేనా

కాన్ఫిడెన్స్ అంతా అదేనా

గుంటూరు, మే 17,
టిడిపి అధినేత చంద్రబాబు ఈ ఎన్నికల్లో గెలుస్తామని ఫుల్లు కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా గెలుపుపై ధీమాగా ఉన్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ కావచ్చు... పోలింగ్ శాతం పెరగడం కూడా తమ గెలుపునకు తిరుగుండదని ఆయన భావిస్తున్నారు. నిన్న మోదీ నామినేషన్ కార్యక్రమానికి వెళ్లిన చంద్రబాబు అక్కడ బీజేపీ సీనియర్ నేతలకు ఇదే విషయాన్ని చెప్పారట. ప్రమాణస్వీకారానికి రమ్మని ఆహ్వానం కూడా పలికారన్న టాక్ పార్టీలో వినిపిస్తుంది. చంద్రబాబు ఎన్నికల రోజు మొత్తం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి వరకూ పార్టీ కేంద్ర కార్యాలయంలోనే కూర్చుని ఉన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పడు తెలుసుకుంటూ తగిన సూచనలు కూడా ఇచ్చారు. మహానాడు కూడా ప్రభుత్వ ఏర్పాటు కోసమే వాయిదా వేసినట్లు ఆయన చెప్పడం విశేషం. పోలింగ్ జరిగిన తీరుపై ఎప్పటికప్పుడు నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించుకున్న ఆయన కూటమికి 120 స్థానాలకు పైగానే గెలుస్తామని చెబుతున్నారట. పోలింగ్ శాతం పెరగడంతో గెలిచే స్థానాల సంఖ్య కూడా ఊహించని విధంగా పెరిగే అవకాశముందని ఆయన అంచనా వేస్తున్నారట. తన నలభైఐదేళ్ల రాజకీయ అనుభవం ఎప్పుడూ ఇంతగా ఫెయిర్ ఓటింగ్ జరగలేదంటున్నారు. ప్రభుత్వంపై కసితో వచ్చిన ఓటర్లు నేరుగా అభ్యర్థిని చూడకుండా తనను చూసి, కూటమి అభ్యర్థులకు ఓటు వేశారని ఆయన గర్వంగా సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. విదేశాల నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఓటర్లలో 80 శాతం మన వైపే ఉన్నారంటూ తనకు అందిన నివేదికల ద్వారా అందాయని ఆయన చెబుతున్నారని తెలిసింది. మరోవైపు మహిళలు ఎక్కువగా వైసీపీ వైపు మొగ్గు చూపుతారన్న వాదనలో అర్థం లేదని కూడా ఆయన చెబుతున్నారట. అందుకు ప్రధాన కారణం ఫ్రీ బస్సు, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల ప్రభావం మహిళలపై బాగా పనిచేసిందని తనకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ద్వారా తెలిసిందని అంటున్నారు. అందుకే ఎవరూ భయపడాల్సిన పనిలేదని, 120 స్థానాలకు పైగానే గెలిచి అధికారాన్ని చేపట్టబోతున్నామని ఆయన పార్టీ సీనియర్ నేతలతో అన్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కూటమి ఏర్పడాన్ని ప్రజలు కూడా స్వాగతించారని, రాష్ట్ర భవిష్యత్ ను గురించి కూడా ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేశారని, అందుకే కూటమి గెలుపును ఈ ఎన్నికల్లో ఎవరూ ఆపలేరని కూడా ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తాను సీఎంగా శాసనసభలో అడుగుపెడతానన్న శపథం నెరవేరబోతుందని కూడా సీనియర్ నేతల వద్ద కామెంట్ చేసినట్లు చెబుతున్నారు.అలాగే నిర్లక్ష్యం వహించిన కొన్ని నియోజకవర్గాల పేర్లను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలిసింది. కూటమి ఏర్పడటంతో ఎలాగూ గెలుస్తామని డబ్బులు బయటకు తీయని నేతల పేర్లు తన వద్ద ఉన్నాయని, వారు ఓటమి అంచున ఉన్నారని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. వారి స్వయంకృతాపరాధం కారణంగానే ఓటమి పాలవుతున్నారని ఆయన అన్నారు. తాను చెప్పినా వినకుండా ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకరిద్దరు నేతలు మితిమీరిన ఆత్మవిశ్వాసానికి పోవడం వల్ల గెలుపు కష్టమయిందన్నారు. మరికొందరు నేతలు పార్టీలో ఉండి కూడా కూటమి అభ్యర్థులకు సహకరించకపోవడం వల్ల కూడా కొన్ని స్థానాలను కోల్పోతున్నామని చంద్రబాబు క్లియర్ కట్ గా ఆ స్థానాల గురించి కూడా సీనియర్ నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది

Related Posts