YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రైల్వేలో మరమ్మత్తులు... ఆలస్యంగా నడుస్తున్న ట్రైన్లు

రైల్వేలో మరమ్మత్తులు... ఆలస్యంగా నడుస్తున్న ట్రైన్లు

విజయవాడ,  మే 18 
ఏపీలో రైళ్ల రాకపోకలు ఆలస్యంకావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. పలు రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగించడంతో స్టేషన్లలో పడిగాపులు కాశారు. విజయవాడ,గుంటూరు డివిజన్‌ పరిధిలో ట్రాక్ మరమ్మతుల కారణంగానే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. వందేభారత్ రైలు దాదాపు 5 గంటలు ఆలస్యంగా బయలుదేరడంతో ప్రయాణికులు మండిపడ్డారు..విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్‌ (20833) రైలు ఏకంగా ఐదు గంటలు ఆలస్యమైంది. సాంకేతిక సమస్యలు కారణంగా ఆలస్యమవుతుందని తెలిపిన అధికారులు... గంట గంటకు పొడిగించుకుంటూ ఉదయం 10.45 గంటలకు పట్టాలెక్కించారు. తెల్లవారుజామునే స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 5 గంటలకుపైగానే స్టేషన్‌లో నిరీక్షించారు. ఆఫీసులకు వెళ్లాల్సిన వాళ్లు, ముఖ్యమైన పనులు ఉన్నవారంతా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేవాళ్లమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సికింద్రాబాద్ నుంచి  మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (20834).. రాత్రి 8 గంటలకు బయలుదేరింది. పూర్తి సమాచారం ఇవ్వకుండా రైల్వే అధికారులు కాలయాపన చేశారని ప్రయాణికులు మండిపడ్డారు. ఇతర రైళ్లలో వెళ్లినా ఇంతకన్నా ముందే వెళ్లిపోయి ఉండేవాళ్లమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.రైళ్ల రాకపోకల్లో జాప్యం కారణంగా రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భువనేశ్వర్‌ నుంచి ముంబై( వెళ్లాల్సిన కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11020)ను కూడా భద్రతాపరమైన కారణాలు చూపి  ఈ నెల 16 నుంచి 31 వరకు దాదర్‌ వరకు కుదించారు. అంతేకాదు జూన్ 1న ముంబై నుంచి బయల్దేరాల్సిన కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ (11019)కూడా దాదర్‌( నుంచే బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ నెల 16వ తేదీ రాత్రి 11.20 గంటలకు విశాఖలో బయలుదేరాల్సిన విశాఖ-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌.. 17వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరనుంది. ఈ నెల 16వ తేదీ రాత్రి 11.40 గంటలకు బయల్దేరాల్సిన సంత్రాగచ్ఛి-తాంబరం వేసవి ప్రత్యేక రైలు.. 17వ తేదీ ఉదయం 4 గంటలకు సంత్రాగచ్ఛిలో బయల్దేరుతుందని తెలిపారు. విజయవాడ, గుంటూరు డివిజన్ పరిధిలో ట్రాక్ మరమ్మతులు కారణంగా ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేయడం జరిగింది. గుంటూరు - విశాఖ, గుంటూరు - రాయగడ, రాజమహేంద్రవరం -విశాఖ, మచిలీపట్నం- విశాఖ, కాకినాడ పోర్టు- విశాఖ రైళ్లు రద్దయ్యాయి. కాకినాడ పోర్ట్ - విశాఖపట్నంకు వెళ్లే ప్యాసింజర్ రైలు, మచిలీపట్నం నుంచి విశాఖ వెళ్లే ఎక్స్‌ప్రెస్ కూడా రద్దయ్యాయి. గుంటూరు - విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్, విశాఖ - గుంటూరు రైళ్లు‌ బుధవారం నుంచి రద్దు చేశారు. మరికొన్నింటిని కుదించారు. అసలే వేసవికాలం కావడంతో రైళ్లలో విపరీతమైన రద్దీ ఉంటోంది. ఈసమయంలో భద్రతాపరమైన కారణాలు చూపి రైళ్లను రద్దు చేయడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.జూన్ 1 వరకు ఇబ్బందులు తప్పకపోవచ్చని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. భద్రతాపరమైన కారణాల రీత్యా....ట్రాక్‌ల మరమ్మతులు చేస్తున్నారని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి జరుగుతున్న పనుల కారణంగా తలెత్తిన తాత్కాలిక ఇబ్బందులను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.

Related Posts