విజయవాడ, మే 18,
ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాము 2019 కంటే మెజార్టీ సీట్లతో విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి జగన్ ధీమాగా ఉన్నారు. కానీ, జగన్ మాటలు ప్రత్యర్ధి కూటమి ప్రచారానికి కౌంటర్ గా కేడర్ లో విశ్వాసం నింపటం కోసమేననే ప్రచారం సాగుతోంది. కానీ, వైసీపీ నేతలు మాత్రం జగన్ ఏది మాట్లాడినా ప్రచారం కోసం ఉండదని చెబుతున్నారు. ఈ సమయంలోనే వైసీపీ ముఖ్య నేత సజ్జల ఎన్నికల ఫలితాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. గెలుపుపై ధీమా ముఖ్యమంత్రి జగన్ తాము 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమాగా చెప్పారు. నాడు గెలిచిన 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్ల కంటే ఎక్కువ వస్తాయని విశ్వాసం వ్యక్తం చేసారు. దీని పైన సొంత పార్టీలో, ప్రత్యర్ధి కూటమిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కేడర్ లో మనోధైర్యం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేసారనే వాదన ఉంది. ఇదే సమయంలో జగన్ అంచనాలు లేకుండా చెప్పరనే మరో వాదన వినిపిస్తోంది. ఈ సమయంలోనే పార్టీ ముఖ్య నేత సజ్జల ఎన్నికల అంచనాలపైన స్పందించారు. జగన్ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా తమ నమ్మకం ఏంటో వివరించారు. 2019 కంటే ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని సజ్జల చెప్పుకొచ్చారు. కుప్పం టు ఇచ్ఛాపురం ప్రతీ నియోజకవర్గంలో సంక్షేమం ఇచ్చామని గుర్తు చేసారు. తాము గతం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామనే పూర్తి విశ్వాసంతో ఉన్నామని వివరించారు. ఎన్నికల సమయంలో జగన్ ప్రచారం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. చంద్రబాబు నెగటివ్ క్యాంపైన్ చేసారని..అది కూటమికి నష్టం చేసందని పేర్కొన్నారు. ఓట్ల కోసం బస్సుల్లో వచ్చిన వారు తమకే ఓటు వేసారని సజ్జల చెప్పారు. తమ ఓటమి ఖాయమని చంద్రబాబుకు ఇప్పటికే అర్దమైందని సజ్జల వ్యాఖ్యానించారు. ఈసీ తప్పు సరిచేసుకోవాలి కేంద్ర సహాయంతో కొందరుఅధికారులను తప్పించారని సజ్జల ఆరోపించారు. కేతిరెడ్డి ఇంట్లో సీసీటీవీలను పోలీసులు ధ్వంసం చేయటం అన్యాయమని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోవాలని సూచించారు. పోలీసుల అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తప్పించాలని డిమాండ్ చేసారు. కౌంటింగ్ లో అక్రమాలు జరుగుతాయని అనుకోవటం లేదని.. కౌంటింగ్ లోఅక్రమాలు జరిగితే ఎదుర్కొంటాం అని సజ్జల స్పస్టంచేసారు. అక్కడక్కడా స్థానికంగా సమస్యలు ఉన్న నియోజకవర్గాలు మినహా అన్నింటా గెలుస్తామన్నారు. కుప్పంలోనూ వైసీపీ గెలుస్తుందని సజ్జల ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.