కోల్ కత్తా, మే 18,
ఒకళ్ళు పొత్తు అంటారు. ఇంకొకరు లేదు లేదు. మా దారి మాదే అంటారు. ఇలా ప్రారంభం నుంచి అదే మాట. సమావేశాలలో వేదిక పంచుకుంటారు. సమావేశం ముగిసిన తర్వాత కత్తులు దూసుకుంటారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం మొత్తం ఎందుకయ్యా అంటే.. పార్లమెంట్ ఎన్నికల ముంగిట.. కాంగ్రెస్ తో సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన “ఇండియా” కూటమిలో ఇదంతా జరుగుతున్న తతంగం కాబట్టి. తాజాగా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు కూటమిలో అస్పష్ట స్నేహాన్ని వెల్లడించగా.. కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలు.. అందులో ఉన్న అతుకుల బొంతను బయటపెట్టాయి. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయాచిత బలాన్ని చేకూర్చాయి.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హల్దియాలో ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ” భారతీయ జనతా పార్టీ నిధులతో కాంగ్రెస్, సీపీఐ(ఎం) ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. వారికి ఎట్టి పరిస్థితిలో ఓటు వేయద్దు. వారితో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదు. ఢిల్లీలో మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తాం. నేను ఇండియా కూటమిలో భాగస్వామిని. దానికి మా పార్టీ మద్దతు ఇస్తుంది. ఇందులో ఎటువంటి అపార్థం లేదని” మమతా బెనర్జీ వివరించారు. మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేయడమే ఆలస్యం.. కాంగ్రెస్ పార్టీ నేత అధీర్ రంజన్ మండిపడ్డారు. ” ఆమె కూటమి నుంచి వెళ్లిపోయారు. ఆమెపై మాకు నమ్మకం లేదు. ఆమె కూడా బిజెపి వైపు వెళ్లొచ్చు. కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయాలని చూశారు. మా పార్టీకి 41 నుంచి సీట్లు రావని ఆమె మాట్లాడారు. ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ, కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. గతంలో ఇదే ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ సీటు కోసం బిజెపిని విమర్శించారు. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఆ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచినప్పటికీ.. మమతా బెనర్జీ ఓడిపోయారు. ఆ స్థానంలో బిజెపి అభ్యర్థి సువేందు అధికారి గెలిచారని” అధీర్ రంజన్ పేర్కొన్నారు.మమత, ఆధీర్ వ్యాఖ్యల నేపథ్యంలో బిజెపి నాయకులు స్పందించారు. ఇండియా కూటమి అంటేనే అతుకుల బొంత అని.. దానిని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. “కూటమిలో ఎవరెవరు ఎటువైపు ఉంటారో తెలియదు. పైగా వీరు ప్రజాస్వామ్యం గురించి చెబుతుంటారు. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకొని.. ఎటువంటి సందేశాలు ఇస్తున్నారు వారికే తెలియాలి” అంటూ బిజెపి నాయకులు విమర్శిస్తున్నారు.. మరో మూడు దశల్లో పోలింగ్ ఉన్న నేపథ్యంలో.. ఇండియా కూటమిలో ఇంకెన్ని లుకలుకలు బయటపడతాయో వేచి చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు మమత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విపక్షాలను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఇండియా కూటమి ఎలా ఉంటుందో.. మమత మాటల ద్వారా తెలిసిపోతుందని చురకలు అంటించారు.