YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పల్లా మీదే గెలుపు బాధ్యతలు

పల్లా మీదే  గెలుపు బాధ్యతలు

వరంగల్, మే 18  
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సవాల్ గా మారింది. తన అనుచరుడైన ఏనుగుల రాకేశ్ రెడ్డికి గ్రాడ్యుయేట్స్ టికెట్ ఇప్పించుకోగా.. తమ సన్నిహితులకు టికెట్ ఇప్పించుకోవాలని ఆశపడిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశలో పడ్డారు. దీంతో ఆయనకు పెద్దగా సపోర్ట్ చేయడం లేదనే ఆరోపణలున్నాయి.ఇటీవల నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రివ్యూ మీటింగ్ తోనే పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడగా.. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలుపు భారమంతా పల్లా రాజేశ్వర్ రెడ్డిపైనే పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముఖ్య నేతలంతా సహాయ నిరాకరణ చేస్తుండటంతో పల్లా కూడా తనకున్న అనుభవంతో క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీలో కొనసాగిన ఏనుగుల రాకేశ్ రెడ్డి వరంగల్ వెస్ట్ టికెట్ ఆశించి భంగపడిన విషయం తెలిసిందే. ఆ తరువాత నాటకీయ పరిణామాల నడుమ రాకేశ్ రెడ్డిని పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకెళ్లారు.ఆ సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆయనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఇదిలాఉంటే ఆయనకు హామీ ఇచ్చిన సమయంలో సైలెంట్ గా ఉన్న కొందరు నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీమానా చేసిన తరువాత తెర మీదకు వచ్చారు. ఎమ్మెల్సీ టికెట్ తనకే కేటాయించాలంటూ పట్టుబట్టారు.ఇందులో ప్రధానంగా దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, మాస్టర్ జీ విద్యాసంస్థల అధినేత సుందర్ రాజ్ యాదవ్ ఉన్నారు. వారితో పాటు పల్లె రవికుమార్, దూదిమెట్ల బాల్ రాజ్ లాంటి వాళ్లు కూడా టికెట్ టికెట్ ఆశించగా వారంతా ఇప్పుడు నిరాశలో పడ్డారు.వరంగల్ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి దయాకర్ రావు పైరవీతో టికెట్ కోసం ప్రయత్నం చేశారు. రాకేశ్ రెడ్డి బీఆర్ఎస్ లోకి రావడం, అందులోనూ ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకోవడం ఇష్టం లేని దాస్యం, పెద్ది, ఎర్రబెల్లి అభ్యర్థిని మార్చాల్సిందిగా కేటీఆర్ పై ఒత్తిడి తెచ్చారు.పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రం ఇచ్చిన మాట ప్రకారం రాకేశ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సమర్థించుకుంటూ వచ్చారు. చివరకు కేసీఆర్, కేటీఆర్ ను ఒప్పించి, అసంతృప్త నేతలకు సర్ది చెప్పారు. దీంతో రాకేశ్ రెడ్డి అభ్యర్థిత్వంపై విముఖత చేసిన నేతలంతా ఇప్పుడు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండ్రోజుల కిందట తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీటింగ్ కు కూడా గైర్హాజరయ్యారు.ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను కాదని, తన అనుచరుడికి టికెట్ ఇప్పించుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక సవాల్ గా మారింది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన రాజీనామా చేయగా.. ఇప్పుడు గ్రాడ్యుయేట్ భారాన్నంతా తన భుజాలపైనే వేసుకున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజీలు, ఉద్యోగ సంఘాల నేతలతో పల్లా మంతనాలు జరుపుతున్నారు.నియోజకవర్గాల కేంద్రాల వారీగా మీటింగులు నిర్వహిస్తూ పట్టభద్రుల మద్దతు కోరే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం జనగామ నియోజకవర్గ కేంద్రంలో మీటింగ్ పూర్తి చేయగా.. ఆ తరువాత ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. గత రెండు పర్యాయాలు నెగ్గిన అనుభవం ఆయనకు ఉండగా.. లోటుపాటులను సమీక్షించుకుంటూ రాకేశ్ రెడ్డి విజయానికి బాటలు వేసే ప్రయత్నం చేస్తున్నారు.మరో వైపు రాకేశ్ రెడ్డి కూడా తనకున్న పరిచయాల మేరకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గతంలో బీజేపీలో పని చేసిన సమయంలో యూత్ కు ఆయన ఎక్కువ దగ్గర కాగా.. వారందరినీ మళ్లి తన గాడికి తెచ్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదిలాఉంటే ఓ వైపు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నేతలు సపోర్ట్ లేకపోవడం, పల్లా ఒంటరి పోరు రాకేశ్ రెడ్డికి విజయాన్ని ఏమేరకేు అందిస్తాయో చూడాలి.

Related Posts