విజయవాడ, మే 20
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమయింది. జూన్ 4న నేతల భవితవ్యం తేలనుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావడంతో.. ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టమైందని టిడిపి కూటమి.. అదంతా ప్రభుత్వ పాజిటివ్ ఓటింగ్ అని అధికార వైసిపి అంచనా వేస్తున్నాయి. అయితే ఎవరి లెక్క వారికి ఉన్నా.. ఆ నాలుగు నియోజకవర్గాల పరిస్థితి ఏంటన్న దానిపై లోతుగా చర్చ నడుస్తోంది. కుప్పం, మంగళగిరి, పిఠాపురం, హిందూపురం నియోజకవర్గాలు. చంద్రబాబు, లోకేష్, పవన్, బాలకృష్ణ లను ఎలాగైనా ఓడిస్తానని కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. వై నాట్ 175 అన్న నినాదంతో వైసిపి ఎన్నికలకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆ నాలుగు నియోజకవర్గాలపై జగన్ ఫోకస్ పెట్టారు. బలమైన అభ్యర్థులను బరిలో దించారు. కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు కంచుకోట. అక్కడ ఈసారి చంద్రబాబును ఓడించాలని జగన్ గట్టి ప్రయత్నమే చేశారు. ఆ బాధ్యతలను పెద్దిరెడ్డికి అప్పగించారు. అక్కడ వైసీపీ గెలిస్తే ఆ పార్టీ అభ్యర్థి భరత్ ను మంత్రి చేస్తానని కూడా ప్రకటించారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ సత్తా చాటింది. కానీ సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికిపూర్తిగా వెనుకబడింది. చంద్రబాబును ఓడించడం అంత ఈజీ కాదని తేలింది. అయితే ఎలాగైనా చంద్రబాబు మెజారిటీని తగ్గించి నైతిక విజయం పొందాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.ఏపీలో అత్యంత హాట్ సీటు పిఠాపురం. ఇక్కడ నుంచి పవన్ పోటీ చేశారు. గత ఎన్నికల మాదిరిగానే ఘోరంగా ఓడించాలని వైసీపీ వ్యూహరచన చేసింది. బలమైన మహిళా నేత వంగా గీతను బరిలో దించింది. పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీతో పాటు బుల్లితెర నటులు రంగంలో దిగారు. సినీ పరిశ్రమ యావత్తు మద్దతు తెలిపింది. అయితే ఇక్కడ ఎలాగైనా గెలుపొందాలి అన్న జగన్ ప్రయత్నం ఆసక్తికరంగా మారింది. చివరి రోజు ప్రచారంలోకి దిగిన జగన్ వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ఆఫర్ చేశారు. అయితే ఇక్కడ పవన్ గెలుపు లాంఛనమేనని తెలుస్తోంది. మెజారిటీ మిగిలిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఏపీలో మరో హాట్ నియోజకవర్గం మంగళగిరి. గత ఎన్నికల్లో మంత్రిగా ఉన్న లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేశారు. అసలు టిడిపి గెలవని ఈ సీట్లో సాహసం చేసి నిలబడ్డారు లోకేష్. కానీ ఓటమి చవి చూశారు. ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే మరోసారి పోటీకి దగ్గర లోకేష్. ఆయనను ఎలాగైనా ఓడించాలని జగన్ భావించారు. వెనుకబడిన తరగతులకు చెందిన మురుగుడు లావణ్యను బరిలో దించారు. నియోజకవర్గంలో పద్మశాలీలు అధికం. లావణ్య ది కూడా అదే సామాజిక వర్గం. అయితే ఇక్కడ లోకేష్ పై సానుభూతి కనిపిస్తోంది. లావణ్య టఫ్ ఫైట్ ఇచ్చినా లోకేష్ దే విజయమని తెలుస్తోంది.హిందూపురం నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టాలని నందమూరి బాలకృష్ణ భావిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో బాలకృష్ణ గెలుపొందారు. అయితే ఈసారి బాలకృష్ణ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని జగన్ భావించారు. చాలామంది అభ్యర్థులను మార్చుతూ.. చివరకు కోడూరి దీపిక అనే మహిళా నేతను జగన్ ప్రయోగించారు. అయితే ఇక్కడ వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. మరోసారి బాలకృష్ణ విజయం ఖాయమని ప్రచారం జరుగుతోంది. పూర్తిస్థాయి ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.