నెల్లూరు, మే 20
ఈమధ్య విజయసాయిరెడ్డి పెద్దగా కనిపించడం లేదు. పోలింగ్కు ముందే ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఎప్పుడు జగన్ విదేశీ పర్యటన చేసినా వెంట విజయసాయిరెడ్డి ఉండేవారు. కానీ కనీసం ఎయిర్పోర్ట్ కు వచ్చి సాగనంపలేదు కూడా. గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చి చాలామంది నేతలు జగన్ దంపతులకు వీడ్కోలు పలికారు. ఆ జాబితాలో విజయ సాయి రెడ్డికి చోటు లేకుండా పోయింది.జగన్ సీఎం అయిన తర్వాత చాలా సార్లు విదేశీ పర్యటన చేశారు.కుటుంబ సమేతంగా వెళ్లేవారు. వెంట విజయసాయిరెడ్డి వెళ్లేవారు. కానీ జగన్ వెళ్లిన దేశానికి వెళ్లేవారు కాదు. ఆ పక్క దేశానికి వెళ్లి జగన్ పర్యటనను పర్యవేక్షించేవారు. కానీ ఈసారి విజయసాయిరెడ్డి జాడ లేకుండా పోయింది. కనీసం ఆయన చడీ చప్పుడు కూడా లేదు. నెల్లూరులో ఎంపీగా పోటీ చేసిన ఆయన పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. తనను బలవంతంగా జగన్ ఎంపీగా పోటీ చేయించారని విజయ సాయి లో ఒక రకమైన అసహనం ఉండేది.సన్నిహితులు వద్ద ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు. ఇక్కడ కీలక నేతగా ఉన్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలోకి వెళ్లిపోయారు. ఆయనను తట్టుకోవడానికి విజయసాయిరెడ్డిని బలవంతంగా తెరపైకి తెచ్చారు. అయితే నెల్లూరులో సీన్ అర్థం అయిన విజయసాయి ముందుగానే చేతులెత్తేశారు. ఎమ్మెల్యేలు గెలిస్తే తాను గెలుస్తాను.. లేకుంటే తాను ఓడిపోతానన్న నిర్ణయానికి వచ్చారు.జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు విజయసాయిరెడ్డి అని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల అనంతరం విజయసాయిరెడ్డి అస్సలు కనిపించలేదు. వైసిపి కార్యాలయానికి కూడా వెళ్లలేదు. జగన్ వెంట కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం జగన్ వెంట బొత్స, పెద్దిరెడ్డి లాంటి వాళ్లు మాత్రమే కనిపించారు. అయితే ఈ పరిణామాల వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఎదురైతే మాత్రం.. విజయసాయిరెడ్డి ఎపిసోడ్ కీలకంగా మారుతుంది అన్న ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా విజయసాయిరెడ్డి కొద్దిరోజుల పాటు పార్టీకి దూరమయ్యారు. తారకరత్న మరణంతో చంద్రబాబుకు సన్నిహితంగా గడిపారు. ఆ సమయంలో విజయసాయిరెడ్డి పై వైసీపీలో అనుమానాలు పెరిగాయి. కానీ అటు తరువాత ఎదురైన పరిణామాలతో జగన్ విజయసాయిరెడ్డిని దగ్గరకు చేర్చుకున్నారు. కానీ వారి మధ్య గ్యాప్ అలానే ఉంది. ఒకవేళ వైసీపీ ఓడిపోతే మాత్రం విజయసాయిరెడ్డి తన ప్రతాపాన్ని చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.