విజయవాడ
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం స్ర్టాంగ్ రూముల్లోని ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. గెలుపోటములపై పార్టీలు, అభ్యర్థులు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.ఉమ్మడి జిల్లాలలో మూడుపార్లమెంట్ పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, అందుబాటులో ఉన్న పోలింగ్ కేంద్రాల వారీగా ఎక్కడ ఎన్ని ఓట్లు పడే అవకాశముందని అంచనా వేసుకుంటున్నారు. ఏ ప్రాంతంలో బలంగా ఉన్నాం,ఎక్కడ పార్టీకి ప్రతికూల పరిస్థితులున్నాయన్న దానిపై ఇప్పటికే అవగాహన ఉన్న పార్టీల నేతలు,ఆయా ప్రాంతాల్లో ఎంత పోలింగ్ బట్టి అది ఎవరికి లాభం,ఎవరికి నష్టం అన్నది బేరీజు వేసుకుంటున్నారు
ఎవరు గెలుస్తారు... విజయావకాశాలున్నాయా...ఏ వర్గం ఓట్లు ఎవరికి అనుకూలం. ఇదే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలలో జరుగుతున్న ప్రధానచర్చ. పోలింగ్ ముగిసిన తర్వాత ఆయా పార్టీల
అభ్యర్ధులు, నాయకులు అంచనాల్లో మునిగి తేలుతున్నారు. పార్లమెంటు పరిధిలోని ఆయా నియోజకవర్గాల వారీగా పోలైన ఓటింగ్ శాతం ఆధారంగా లెక్కలేస్తున్నారు. గెలుపోటముల విషయంలో బేరీజు వేసుకుంటున్నారు. ఓవైపు పైకి గెలుస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నా... లోపల మాత్రం జూన్ 4న వెలువడే ఫలితాలపైనే ఆశలు పెట్టుకుంటున్నారు.
ఆయా నియోజకవర్గాల్లో హోరాహోరీగా కొనసాగించిన ఎన్నికల ప్రచారం మొదలు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్ల తీరును బట్టి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడుతాయనే అంచనాలతో ఓట్ల లెక్కలేస్తున్నారు. కూడికలు తీసివేతలతో గెలుపు అంతరాన్ని నిర్ణయిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కొంత మందిలో ఆశలు నింపగా మరికొందరిని నిరాశ పరిచాయి.
ఎవరి లెక్కలు వాళ్లవే....
ఉమ్మడి జిల్లాలలోని 21 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నాయకులు తమకే విజయావశకాలున్నాయని చెప్పేస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీల వారీగా వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకుంటూనే ఈసారి ఏ గ్రామాలు, డివిజన్లలో ఎవరికి ఓట్లు పెరిగాయి, తగ్గాయి అని విశ్లేషించుకుంటున్నారు. ఊరువాడల్లో ఎక్కడా ఇద్దరు గూమిగూడినా.. ఏ నాయకుడిని పలకరించినా ఎవరు గెలుస్తారనే దానిపైనే చర్చ జరుగుతోంది. ఫోన్లలో సన్నిహితులు, ఇతర కార్యకర్తలను పలకరిస్తూ గెలుపు ఓటముల గురించే ఆరా తీయడం వినిపిస్తోంది. ఏ వర్గం వారు తమకు అనుకూలంగా ఓటు వేసే అవకాశముందని తెలుసుకుంటూనే ఎవరు ప్రతికూలంగా వ్యవహరించారనే విషయాలపై అనుచరులతో ముఖ్య నాయకులు చర్చిస్తున్నారు. ఫలితాల తీరుపై అంచనాలను రూపొందిస్తున్నారు.
ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ....
ఉమ్మడి జిల్లాలలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ నెలకుంది. ఎవరు ఎవరి విజయావకాశాల్ని దెబ్బతిస్తారనే చర్చ ఊపందుకుంది. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులు విజయం తమదంటే తమదేనని నాయకులకు భరోసా ఇస్తున్నారు. కార్యకర్తల్లోనూ ధైర్యాన్ని నింపే విధంగా ముఖ్య నాయకులు మాట్లాడుతున్నారు. జూన్ 4వ తేదీ ఫలితాల దాకా వేచి చూద్దామని చెబుతూనే నాయకుల్లో ఆశావాహ దృక్పథాన్ని పెంచుతున్నారు.
ఎక్కడెక్కడ తారుమారు....
పోలింగ్ శాతం అనుకున్నంతగా పెరుగకపోవడంతో పాటు తగ్గిన పోలింగ్ సరళి ఎవరిని ఇబ్బంది పెడుతుందనే విషయమై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఉమ్మడి జిల్లాలలో పిఠాపురం నియోజకవర్గంలోనే గత ఎన్నికల్లో కంటే కాస్త మెరుగైన ఓటింగ్ పడింది. మిగతా నియోజకవర్గాల్లో పోలింగ్ స్వల్పంగా పెరిగింది. దీంతో అన్ని పార్టీలు ఆయా పోలింగ్ కేంద్రాల వారీగా నమోదైన ఓట్ల ఆధారంగా లెక్కలేస్తున్నాయి. ఓటింగ్ శాతాన్ని బట్టి తమ అభ్యర్ధికి పడే అవకాశమున్న ఓట్లు, ప్రత్యర్ధులకు లభించే మద్దతుపై అవగాహనకు వస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీలకు వచ్చిన ఓట్లతో పోలిస్తే ఈసారి మనకు ఎక్కడ బలం పెరిగింది, ఎక్కడ తగ్గిందనే విషయమై అంచనా వేసుకుంటున్నారు. మొత్తంగా ఎవరికి వారుగా విజయావకాశాలపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈవీఎం బ్యాలెట్లో నిక్షిప్తమైన ఓట్లు మాత్రం అసలు గుట్టును జూన్ 4న తేల్చనున్నాయి. దీంతో తుది తీర్పు వెల్లడయ్యే సమయం కోసం అభ్యర్ధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.