లక్నో, మే 20
ఎన్నికల్లో గెలవడం కోసం అభ్యర్థులు ప్రజలకు వరాలు గుప్పిస్తారు. తాయిలాలు ఇస్తారు. ఇది సాధారణం. కానీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కూడా ఇప్పుడు అనేక సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల సంఘంలో కలిసి పోలింగ్ శాతం పెంచడానికి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బిర్యానీ ఫ్రీ, ఆస్పత్రుల్లో ఓపీ ఫ్రీ, ఫ్లైట్ టికెట్ చార్జీల్లో రాయితీ, సినిమా టికెట్లలో డిస్కౌంట్ వంటి ఆఫర్లు ప్రకటించాయి. తాజాగా యూపీలోని ఓ స్కూల్ యాజమాన్యం తమ పాఠశాలలో చదివిలే పిల్లల తల్లిదండ్రులు ఓటు వేస్తే.. పిల్లలకు 10 మార్కులు అదనంగా ఇస్తామని ప్రకటించింది.దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 543 స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నాలుగు విడతల్లో పోలింగ్ పూర్తయింది. మొదటి మూడు విడతల్లో 60 శాతం లోపే పోలింగ్ నమోదైంది. నాలుగో విడతలో కాస్త పెరిగింది.
మే 20న ఐదో విడత పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో యూపీ రాజధాని లక్నోలోని స్కూళ్లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తమ స్కూళ్లలో చదివే పిల్లల తల్లిదండ్రులు ఓటే వేస్తే విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 మార్కులు అదనంగా వేస్తామని సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల యాజమాన్యం ప్రకటించింది. అలాగే తమ స్కూళ్లలో పనిచేసే సిబ్బంది ఓటువేస్తే వారికి ఒక రోజు వేతనం అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మే 20న యూపీలో ఎన్నికలు జరుగనున్నాయి.ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటు వేయడం ద్వారా మంచి నేతను ఎన్నుకునే అవకాశం ఉంటుందని స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ 50 శాతం, 60 శాతమే నమోదైన నేపథ్యంలో ఐదో విడతలో పోలింగ్ పెంచేందుకు ఈ ఆఫ్ ప్రకటించినట్లు తెలిపింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు పౌరులంతా ఓటు వేయాలని కోరింది.