YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పిసీసీ రేసు... ఆశల పల్లకిలో పలువురు నేతలు

పిసీసీ రేసు... ఆశల పల్లకిలో పలువురు నేతలు

హైదరాబాద్, మే 20 
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం ముగిసింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తరువాత తెలంగాణ పీసీసీ చీఫ్ మార్పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రంలో అధికార పీఠం ఎవరికి దక్కనుందో జూన్ 4న తేలనుంది. ఆ తర్వాత కాంగ్రెస్ హై కమాండ్ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే విషయంలో దృష్టి సారిస్తుందని నేతలు చెబుతున్నారు. పీసీసీ చీఫ్ గా జూన్ 26, 2021 లో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అప్పటి నుండి రేవంత్ రెడ్డి  సారధ్యంలో శాసన సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది. జీరోగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి తేవడంలో రేవంత్ రెడ్డి సఫలీకృతమయ్యారు. వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో రేవంత్ సారధ్యంలోనే మళ్లీ సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగింది. ఆయా సర్వేలు చెప్పినట్లు రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకుంటుందన్న నమ్మకంలో హస్తం నేతలు ఉన్నారు. సారధ్య బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి తనదైన దూకుడుతో రేవంత్ రాజకీయాలు సాగించారు. వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లోను మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకంతో ఉంది. ఇక రాష్ట్ర పాలనా వ్యవహారాలపై రేవంత్ పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించేలా, వెసులుబాటు కల్పించేందుకు గాను టీపీసీసీ బాధ్యతలను వేరొకరికి అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు. అధిష్టానంతో దగ్గర సంబంధం ఉన్న నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యమంత్రితో కలుపుకుని రాష్ట్ర క్యాబినెట్ సంఖ్య 18 ఉండాలి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సహా 12 మంది క్యాబినెట్లో ఉన్నారు. మిగిలిన ఆరు ఖాళీలను పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే దీని మీద అధిష్టానానికి ఓ క్లారిటీ ఉందని, సామజిక వర్గాలవారీగా, జిల్లాల వారీగా ప్రాతినిధ్యం ఇచ్చే రీతిలో మిగిలిన ఆరు స్థానాలను భర్తీ చేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఈ తంతు ముగియగానే.. పీసీసీ సారధ్య బాధ్యతలను రేవంత్ రెడ్డి నుంచి తప్పించి పూర్తిగా పాలనపై దృష్టి సారించేలా వెసులుబాటు కల్పిస్తారని చెబుతున్నారు.
కొత్త పీసీసీ చీఫ్ గా సీనియర్ నేతకు అవకాశం దక్కుతుందంటున్నారు. ఈక్రమంలో ఇప్పటికే ఆయా సామాజిక వర్గాల నుంచి కీలక నేతలు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలను కలిసినప్పుడల్లా తమ సీనియారిటీనీ, పార్టీ సేవలను, అధిష్టానం పట్ల తమ విధేయతను ప్రకటిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పీసీసీ చీఫ్ రేసులో మంత్రి భట్టి విక్రమార్క సహా, ప్రస్తుత పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్, మాజీ ఎమ్మెల్యే సంపత్, మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ వంటి నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే అధిష్టానం ఎవరికి అభయహస్తం ఇస్తుందో మాత్రం వేచి చూడాల్సిందే.  పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వందకు వంద శాతం సక్సెస్ కావడంతో ఆ తర్వాత పగ్గాలు స్వీకరించే నేత కుడా ఆ మేరకు సామర్ధ్యంగల వ్యక్తే ఉండాలన్నది అధిష్టానం యోచనగా పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. అంతే కాకుండా గాంధీ కుటుంబం పట్ల విధేయత తప్పనిసరి అర్హతగా కాంగ్రెస్ చరిత్ర తెలిసిన వారు ఎవరయినా చెబుతారు. అంతే కాకుండా.. ఏ సామాజిక వర్గానికి  ఈ దఫా అవకాశం ఇస్తారా అన్నది కూడా పార్టీ లో ఉత్కంఠకు తెరలేపుతోంది. పీసీ చీఫ్ గా ఎస్సీ సామాజిక వర్గం నుండి అవకాశం ఇస్తారా.. లేక బీసీల నుండి అవకాశం ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. లేదంటే... ఓసీల నుండి అంటే రెడ్డి సామాజిక వర్గానికే మళ్లీ ఆ పీఠం దక్కుతుందా అన్న అంశంపైన పార్టీలో చర్చలు సాగుతున్నాయి. ఏది ఏమైనా... వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను మరింత పటిష్టం చేసే కార్యచరణలో భాగంగానే పీసీసీ పీఠం సమర్థుడైన వ్యక్తికి దక్కుతుందని, ఇప్పటికే అన్ని రకాలుగా పార్టీ హైకమాండ్ ఈ విషయంలో తనకు కావాల్సిన సమాచారం సేకరించిందని హస్తం నేతలు చెబుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి ఓటు వేస్తారా అన్న విషయం పైన చర్చలు సాగుతున్నాయి. అటు ప్రభుత్వం – ఇటు పార్టీ సమన్వయంతో నడవాలంటే.. రేవంత్ రెడ్డికి సహకరించే వ్యక్తే పీసీసీ చీఫ్ గా ఉండవచ్చని.. ఈ అంశం కూడా పీసీసీ చీఫ్ ఎంపికలో ప్రధాంగా మారవచ్చన్న ఉహాగానాలు వెలువడుతున్నాయి. అటు సోనియా గాంధీ సహా, రాహుల్, ప్రియాంకలతో రేవంత్ కున్న సంబంధాల దృష్టా ఈ ఎంపికలో రేవంత్ పాత్ర ప్రముఖంగా ఉండవచ్చని చెబుతున్నారు. ఏది ఏమైనా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ చీఫ్ మారడం ఖాయమని... స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త సారధి నేతృత్వంలోనే తెలంగాణ కాంగ్రెస్ వెళ్లనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఈ కారణంగా ఇప్పటి నుండే... పార్టీ అగ్రనేతల కనుసన్నల్లో పడేందుకు ఆశావాహులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను పార్టీ ముఖ్య పదవిని దక్కించుకునేలా వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నారు.

Related Posts