YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

బీజేపీని వదిలించుకునేందుకు బాబు సిద్ధమా..?

బీజేపీని వదిలించుకునేందుకు బాబు సిద్ధమా..?

బిజెపిని వదిలించుకునే ప్లాన్ లో చంద్రబాబు

అది ఓ ప్రత్యేక హోదా కోసం అయితే బాగుండేది. పోలవరం కోసం అయితే మరింత బాగుండేది. రాజధానికి నిధులు ఇవ్వలేదనే కారణంతో అయినా ఓకే. ఏపీకి హామీ ఇచ్చిన రైల్వే జోన్ అటకెక్కించినందుకు అయినా పర్వాలేదు. కానీ బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించటంతోనే తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. అందుకే మీడియా ప్రశ్నించగానే…తమతో ఉండటం ఇష్టంలేదని బిజెపి  చెపితే ఓ నమస్కారం పెట్టి తప్పుకుంటాం అని వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా ఆయన లైన్ ఇదే. పోలవరం విషయంలోనూ అదే అన్నారు. విష్ణుకుమార్ రాజు లేవనెత్తిన అనైతిక అంశాలపైనా అదే చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు ఓకే అంటున్నా..అందులో జరిగిన అవినీతి గురించి బిజెపి నేతలు మాట్లాడుతూనే ఉన్నారు. తమకు చేయాల్సిన సాయం చేయకుండా ఉంటున్న కేంద్రం,  బిజెపి నేతలు..మిత్రపక్షంగా ఉండి ఇలా తమను గుచ్చుతున్న వైనం చంద్రబాబుకు నచ్చటం లేదు.

నిజంగానే బిజెపితో కలసి ముందుకు సాగితే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా నష్టపోవాల్సి ఉంటుందనే భయంతోనే టీడీపీ నేతలు ఉన్నారు. అందుకే ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వెళుతున్నారు. హోదా లేదు..ప్రత్యేక ప్యాకేజీ లేదు..విజభన హామీలు అమలు చేయలేదు అనే విషయాలను చంద్రబాబే స్వయంగా చెబుతున్నారు. మరి ఎన్నికల ఏడాదిలో కేంద్రంలో..రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉండి ఏమి సాధించారు అంటే..చంద్రబాబు దగ్గర  చెప్పటానికి సమాధానం కూడా ఉండదు. ఒక్క చంద్రబాబునే ఎందుకు అంటారు..హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తానన్నారు కదా? ఎందుకు చేయటంలేదు అన్నది చంద్రబాబు ప్రశ్న. నిజమే..ఎంపీల రాజీనామాపై జగన్ వెనక్కి తగ్గారు. మరి అసలు హోదానే అక్కర్లేదు..ప్యాకేజీనే చాలు అని చెప్పిన చంద్రబాబు దగ్గర దీనికి సమాధానం ఉందా?.

హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించినా..అది కూడా నెరవేర్చని బిజెపితో సాగటం వెనక మతలబు ఏమిటి?. ఇంత కాలం సఖ్యతతో ఉండి సాధించుకుంటాం అని ప్రకటించిన చంద్రబాబు..ఇప్పుడు కోర్టు మాట ఎత్తుతున్నారు. కోర్టు అంటే బిజెపికి వ్యతిరేకం కాదు అట…మరి కేంద్రంలో ఉన్నది బిజెపి నేతృత్వంలో ఏన్డీయే కాదా?. విభజన చట్టం ప్రకారం హామీలు అమలు చేయాల్సింది కేంద్రం కాదా?. బిజెపి మీద కాక..కేంద్రం మీద కాకుండా కోర్టుకు ఎవరి మీద వెళతారు?. ఎన్నికల నాటికి ఈ అంశాలు అన్నీ తన మెడకు చుట్టుకోవటం ఖాయం అని భావించే చంద్రబాబు ఎలాగోలా బిజెపిని వదిలించుకునేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ స్పీడ్ రాబోయే నెలల్లో మరింత ఊపందుకోవటం ఖాయంగా కన్పిస్తోందని టీడీపీ వర్గాలు చెబతున్నాయి.

Related Posts