YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

అనంతలో టికెట్ ఫైట్

అనంతలో టికెట్ ఫైట్

 తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లా కంచుకోట. కాంగ్రెస్ గాలులు బలంగా వీచిన సందర్భాలలో కూడా ఇక్కడ తెలుగుదేశాన్ని ప్రజలు ఆదరిస్తూనే వచ్చారు. రాష్ట్ర విభజనకి ముందు పదేళ్లు టీడీపీ విపక్షంలో ఉంది. అలాంటి పార్టీకి గత ఎన్నికల్లో 12 మంది శాసనసభ్యులు,ఇద్దరు ఎంపీలు, మెజారిటీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను ఈ జిల్లా ప్రజలు అందించారు. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 గెలుచుకోవడం అంటే మమూలు విషయం కాదు! మున్సిపాల్టీల్లోనూ పసుపు జెండా ఎగిరేలా చేశారు. జిల్లాలో ఆ స్థాయిలో పట్టు ఉన్న అధికారపక్షం ఎలా ఉండాలి? వెలిగిపోవాలి. జనంలోకి దూసుకుపోవాలి. మరింత జనాదరణని తమ ఖాతాలో వేసుకోవాలి. కానీ అనంతలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

అనంతపురం జిల్లా టీడీపీలోని దిగ్గజాల మధ్య సయోధ్య కరువైంది. ఒకరంటే మరొకరికి గిట్టడం లేదు. స్వలాభం కోసం పార్టీ శ్రేణులను కూడా దూరం పెడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లలో కామినేని శ్రీనివాస్ ఈ జిల్లాకి ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ఉన్నారు. బీజేపీ నుంచి వచ్చిన ఆయన పార్టీపై నియంత్రణ చేయలేని పరిస్థితి. ఆ తర్వాత మంత్రి కొల్లు రవీంద్రకి పార్టీ బాధ్యతలు అప్పగించారు. అయినా పరిస్థితిలో మార్పురాలేదు. ఆఖరి నిముషంలో మంత్రి దేవినేని ఉమని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా తెరపైకి వచ్చారు.

 

దేవినేని రంగంలోకి వచ్చాక అనంతపై సీరియస్‌గా దృష్టిసారించారు. నేతల మధ్య ఉన్న విభేదాలు గుర్తించి.. ఎక్కడికక్కడ కళ్లెం వేసే ప్రయత్నం చేశారు. అయినా కొందరిలో మార్పు రాలేదు. ఈ మధ్య పుట్టపర్తిలో చీఫ్‌విప్ పల్లె రఘునాథరెడ్డి అధ్యక్షతన జిల్లా మహానాడు జరిగింది. ఈ వేదిక పైనుంచే దేవినేని ఉమా నిప్పులు చెరిగారు. పార్టీలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల మధ్య ఉన్న విభేదాలను అధినేత క్షమించరని స్పష్టంచేశారు. ఈ గొడవలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఆయా నేతలకు టిక్కెట్ వస్తుందనే నమ్మకం కలగడం లేదని అన్నారు. ఎంతటివారికైనా అధినేత నిర్ణయమే శిరోధార్యమని చురకలంటించారు. అనంతపురం జిల్లా ముఖ్య నేతలు ఇకనైనా మేలుకోవాలని కోరారు. తమ మధ్య ఉన్న విభేదాలకు స్వస్తి చెప్పాలని విజ్ఞప్తిచేశారు. గొడవలతో కాలక్షేపం చేసేవారికి ఎప్పటికీ ప్రోత్సాహం లభించదన్నారు. వేదిక మీద ఉన్నవారే కాదు- వేదిక కింద ఉన్నవారికి కూడా ఈ విషయంలో మినహాయింపు లేదన్నారు.

 

జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి దేవినేని ప్రసంగానికి కార్యకర్తలు ముగ్ధులయ్యారు. వారిలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. సభానంతరం తిరిగి వెళుతున్న దేవినేని ఉమాను కార్యకర్తలు చుట్టూముట్టారు. మంచి ప్రసంగం చేశారంటూ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. దేవినేని ఉమా చేసిన హెచ్చరికల నేపథ్యంలో టీడీపీ ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దేవినేని ఈ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉండటంతో ఆయన పర్యవేక్షణలోనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పార్టీ క్యాడర్‌ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న స్థానాలతో పాటు మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో కూడా పసుపు జెండా ఎగురవేస్తే ఇక ఈ జిల్లాలో వైసీపీకి స్థానమే ఉండదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.

Related Posts