వైసీపీ అధినేత జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో చేస్తున్న పాదయాత్రతో రాజకీయంగా వేడెక్కింది. రాబోయే ఎన్నికల్లో గెలుపొందేందుకు తగిన వ్యూహ రచన చేస్తున్నారు. ఇందు కోసం జిల్లాలోని ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన కొందరు ప్రముఖులు వైసీపీలోకి వెళ్లిపోతున్నారని ప్రచారం జోరందుకుంది.
ఇందులో పాలకొల్లు నియోజకవర్గంలో ఓ జాతీయ పార్టీకి చెందిన నాయకుడు, డెల్టాలోని అధికార పార్టీ కి చెందిన ఒక ప్రజా ప్రతినిధి వైసీపీ తీర్థం తీసుకుంటారని ముమ్మర ప్రచారం జరుగుతోంది. జగన్ జిల్లాలో ప్రవేశించడానికి ముందే మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్యను వైసీపీలోకి ఆహ్వానించారు. ఆయన సున్నితంగా తిరస్కరించి, తాను తటస్థంగానే ఉంటానని చెప్పారు. రాయబారం నడిపిన నేతలు మాత్రం మీరు తటస్థంగానే ఉండండి.. మీ కుమారుడు సూర్యప్రకాష్‌కు డెల్టాలో ఆచంట లేదా నరసాపురంలలో టిక్కెట్టు ఇప్పిస్తా మని, తమ పార్టీ విజయానికి సహకరించాలని కోరుతు న్నారు. మెట్టలో పట్టున్న కరాటం రాంబాబును వైసీపీ శ్రేణులు ఆహ్వానించారు. వచ్చే ఎన్నికలలో విజయం సాధిస్తే సముచితమైన స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన.. ఆలోచిద్దాం.. సమయం ఉందిగా అంటూ బదులిచ్చినట్లు సమాచారం.
పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీలో సమీకరణలపై ప్రచారం ఊపందుకుంది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి వైసీపీలోకి వస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. 2004లో తటస్థంగా ఉన్న డాక్టర్ బాబ్జీని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలిచి టిక్కె ట్ ఇచ్చి పాలకొల్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అనం తరం 2009లో జరిగిన త్రిముఖ పోటీలో ఓటమి పాల య్యారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బంగారు ఉషారాణి విజయం సాధించగా, ప్రజారాజ్యం పార్టీ అధినే త మెగాస్టార్ చిరంజీవి, డాక్టర్ బాబ్జీ ఓటమి పాలయ్యారు. తర్వాత 2014లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యం లో డాక్టర్ బాబ్జీకి టీడీపీ టిక్కెట్ లభించలేదు. దీంతో బాబ్జీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. వైసీపీ నుంచి మేకా శేషుబాబు పోటీ పడినప్పటికీ టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు విజయం సాధించారు. 2014 ఎన్నికల సమయంలో డాక్టర్ బాబ్జీకి టిక్కెట్ ఇవ్వనప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సముచితంగా గౌరవిస్తామని చంద్రబాబు చెప్పినప్పటికీ ఆయన మనస్థాపం తో బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు చెడటంతో నేరుగా బీజేపీ బరిలోకి దిగితే పాలకొల్లు నియోజకవర్గం నుంచి డాక్టర్ బాబ్జీ గెలుపు సునాయసమని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల సమయానికి బీజేపీ, వైసీపీ పొత్తు పెట్టుకుంటే డాక్టర్ బాబ్జీ గెలుపు మరింత సునాయాసమని వైసీపీ శ్రేణుల్లోని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పాలకొల్లు నుంచి వైసీపీలో గుణ్ణం నాగబాబు, మేకా శేషుబాబు టిక్కెట్టు ఆశిస్తున్నారు. వర్గపోరు జగన్ దృష్టికి వెళ్ళడంతో తృతీయ ప్రత్యామ్నాయంగా డాక్టర్ సత్యనారాయణమూర్తికి అవకాశం కల్పిస్తారనే ప్రచారంతో పాలకొల్లులో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
డెల్టాలో బీసీ వర్గానికి చెందిన ఒక ప్రజా ప్రతినిధికి వైసీపీ గేలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెనుకబడిన వర్గాల్లో మంచి పట్టుకలిగిన ఆ ప్రజా ప్రతినిధిని పార్టీలోకి తెచ్చుకుని నరసాపురం పార్లమెంటరీ స్థానంలో తమ అభ్యర్థిగా నిలిపితే మంచి మెజారిటీతో గెలుస్తారని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీకి ఉన్న ఫిక్స్‌డ్ ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతోపాటు సంఖ్యాపరంగా అధికంగా ఉన్న బీసీ వర్గాలలోని ఓట్లు సొంతం చేసుకుంటే గెలుపొందవచ్చనేది వ్యూహం. ఆ ప్రజా ప్రతినిధిని ఏదో ఒక విధంగా పార్టీలోకి తెచ్చుకోవడం మంచిదనే జగన్‌కు ఆ పార్టీలోని కొందరు సీనియర్లు సూచించినట్లు సమాచారం.