YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జిల్లాపై టీఆర్ఎస్ ఫోకస్

జిల్లాపై టీఆర్ఎస్ ఫోకస్

 జ‌గిత్యాల జిల్లాపై ఎంపీ క‌విత ఎలాంటి ఫోక‌స్ పెట్టారు? నాలుగేళ్ల త‌ర్వాత జిల్లాలో ఎలాంటి సంద‌డి క‌నిపిస్తోంది? ఏ రెండు నియోజ‌క‌వ‌ర్గాలను క‌విత‌ టార్గెట్‌గా పెట్టుకున్నారు? జ‌గిత్యాల జిల్లా మొత్తం గులాబీజెండా ఎగుర వేయ‌డమే తన ల‌క్ష్యంగా పెట్టుకుంది అధికార టీఆర్ఎస్. అందుకే ఎన్నిక‌ల‌కు ఏడాది ముందే చేరిక‌ల‌ సందడికి తెరతీసింది. తద్వారా పార్టీలో జోష్ పెంచుతోంది. ముఖ్యంగా వివిధ సామాజికవర్గాల వారిని మ‌చ్చిక చేసుకుంటోంది. నిజామాబాద్ ఎంపీ క‌విత జిల్లా పార్టీ బాధ్యత‌లను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. స‌ర్పంచ్‌ మొదలు వార్డ్‌ మెంబర్‌ వరకూ ఎవరు టీఆర్‌ఎస్‌ విధానాలు నచ్చి ఆ పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తున్నారు. మరికొందరిని పార్టీ పెద్దలే ఆకర్షించి గులాబీ కండువాలు కప్పిస్తున్నారు.

 

నిజ‌మాబాద్ పార్లమెంట్ ప‌రిధిలో కోరుట్ల, జ‌గిత్యాల అసెంబ్లీ స్థానాలున్నాయి. కోరుట్లలో విద్యాసాగ‌ర్‌రావు తనదైన రీతిలో పట్టు కొనసాగిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో సునాయాసంగా విజ‌యం సాధించారు. నాలుగేళ్ల పాలనాకాలంలో ప్రభుత్వ కార్యక్రమాల‌తో పాలు పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. తద్వారా తన పలుకుబడి పెంచుకున్నారు. ఇక జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో గులాబీ జెండా ఎగరలేదు. అందుకే ఈసారి ఎలాగైనా ఇక్కడ విజ‌యం సాధించి తీరాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది.

 

ఉత్తర తెలంగాణ‌లో కంటిలో న‌లుసుగా ఉన్న జ‌గిత్యాల మీద ఈసారి అధికారపక్షం సీరియస్‌గానే దృష్టి సారించింది. గత నాలుగేళ్లలో ప్రభుత్వ కార్యక్రమాల పేరుచెప్పి ఎంపీ కవిత ప్రజల్లో విస్తృతంగా పర్యటించారు. ఇటీవలే మంత్రి కేటీఆర్‌తో జ‌గిత్యాల‌కు నాలుగు వేల ఇళ్లు కేటాయింపచేశారు. మున్సిపాలిటీకి యాభై కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. ఇవికాక త‌ను వెళ్లిన ఏ గ్రామానికైనా ఏదో ఒక భారీ హామీ ఇస్తున్నారు. ఇలా ప్రభుత్వ పథకాల అమలుకి తోడు పార్టీ కార్యక్రమాలపై కూడా ఎంపీ క‌విత‌ శ్రద్ధపెట్టారు. టీఆర్ఎస్ జైత్రయాత్ర జ‌గిత్యాల నుంచే మొద‌లుపెడ‌తాం అంటూ బ‌హిరంగ స‌భ‌ల్లో ఆమె చెప్తున్నారు. ఈ ప్రకటన పార్టీ శ్రేణుల్లో మ‌రింత జోష్ పెంచుతోంది.

 

ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం ఉంది. అయినప్పటికీ, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ బూత్‌ క‌మిటీల‌ను ఏర్పాటుచేశారు. ఈ ఒక్క అంశం చాలు- జ‌గిత్యాల‌ని పాలక పెద్దలు ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారో చెప్పడానికి! ఇక‌ నియోజ‌కవ‌ర్గ ఇన్‌ఛార్జ్‌ సంజ‌య్‌కుమార్‌ను ఏ వేదిక మీద అయినా ఎమ్మెల్యే అంటూనే సంబోధిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌నే పోటీచేస్తారంటూ బ‌ల్లగుద్ది మ‌రీ చెప్పారు. దీనికి తోడు ఆయ‌నకు అండ‌గా ఉండేందుకు పార్టీలోకి చేరిక‌ల‌ను ప్రోత్సహిస్తున్నారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీల‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. టీ- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.ర‌మ‌ణకు స‌న్నిహితుడు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్‌ బోగ వెంక‌టేశ్వర్లుకు గులాబీ కండువా క‌ప్పారు. మొన్నటివరకూ టీడీపీతోనే ఉంటా అన్న ఆయ‌న స‌డెన్‌గా రూటు మార్చారు. త‌న‌కు పార్టీలో స‌రైన ప్రాధాన్యం ఇవ్వడంలేద‌ని ఆరోపిస్తూ.. టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. అయితే జ‌గిత్యాల‌ టీడీపీ నేత‌లు బోగ వెంక‌టేశ్వర్లుని బాగానే గౌర‌వించారన్న ప్రచారం జ‌రుగుతోంది. అయితే ఆయ‌న ఎల్‌.ర‌మ‌ణ విష‌యంలోనే కొద్దిగా నిరాశ‌తో ఉన్నట్లు చెప్తున్నారు. ఇలా టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ని, ఇత‌ర కులాల వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ టీఆర్‌ఎస్‌ బ‌లం పెంచుకుంటున్నారు.

 

మ‌రోవైపు కోరుట్ల నియోజ‌క‌వ‌ర్గంపైనా అదేస్థాయిలో దృష్టిపెట్టారు ఎంపీ క‌విత‌. స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగ‌ర్‌రావుతో క‌లిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కోరుట్ల టీడీపీ నియోజ‌కవ‌ర్గ ఇన్‌ఛార్జ్‌ సాంబారి ప్రభాక‌ర్‌ను సైతం పార్టీలోకి ఆహ్వానించారు. ఎప్పటినుంచో టీడీపీలో ఉన్న ఆయ‌న ఇటీవ‌లే టీఆర్ఎస్ కండువా క‌ప్పుకున్నారు. ఇలా జ‌గిత్యాల‌, కోరుట్ల టీడీపీ ఇన్‌ఛార్జ్‌ల‌ను పార్టీలోకి చేర్చుకుని బ‌ల‌గం పెంచుకున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు.

 

అయితే కొత్తగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్న వారి సంగతి ఓకే! పార్టీలో కొనసాగుతున్న పాత‌వారికి తగిన ప్రాధాన్యం లభించడం లేద‌న్న విమర్శ వినిపిస్తోంది. ఎన్నిక‌ల నాటికి వీళ్లంతా లేనిపోని రూమ‌ర్స్ సృష్టిస్తే.. ఇప్పటివ‌ర‌కు ప‌డ్డ క‌ష్టమంతా వృథా అవుతుంది. పార్టీలోకి చేరిక‌లు ఎంత ముఖ్యమో పార్టీలో ఉన్న పాతవారిని బుజ్జగించ‌డం కూడా అంతే ముఖ్యం అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లేక‌పోతే మొద‌టికే మోసం వ‌స్తుందన్న మాట నిజం. చూడాలి మ‌రి.. పాత‌- కొత్త నేతల క‌ల‌యిక‌లు టీఆర్‌ఎస్‌కి ఏ మేరకు బ‌లం చేకూరుస్తాయో.

Related Posts