గుంటూరు, మే 21
ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి గెలుపు ఖాయమని ఆ పార్టీ వర్గాల్లో బలమైన నమ్మకం ఏర్పడింది. 135 నుంచి 140 స్థానాలు దక్కే అవకాశం ఉందని టిడిపి హాట్ కోర్ ఫ్యాన్స్ బలమైన నమ్మకంతో ఉన్నారు. మొన్నటి పోలింగ్ శాతం పెరగడం, బయట ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు రావడం వెనుక ప్రభుత్వ వ్యతిరేకత ఉందని విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభిమానులై ఉండి.. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాల్లో ఉన్నవారు కౌంటింగ్ నాడు ఏపీకి వచ్చేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే రైలు, విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. 4వ తేదీన విజయోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుపుకుంటున్నారు.ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ ఈసారి పెరిగింది. 83% నమోదయింది.ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూటమికి అనుకూలంగా పడినట్లు విశ్లేషణలు ఉన్నాయి. ఈసారి వలస వెళ్లిన కూలీలు సైతం పెద్ద ఎత్తున స్వస్థలాలకు వచ్చి ఓట్లు వేశారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్ళిన వారు సైతం ఆసక్తి చూపారు. విద్యార్థులు, యువత కసితో ఓటు వేశారు. అయితే ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని కూటమిలో ఆనందం నెలకొంది. అధికార వైసీపీలో మాత్రం ఆ స్థాయిలో ధీమా కనిపించడం లేదు. అందుకే టిడిపి శ్రేణులు ముందడుగు వేస్తున్నాయి. విజయం పై నమ్మకం పెట్టుకున్నాయి. టిడిపిని అభిమానించేవారు లెక్కింపునాడు విజయోత్సవంలో పాల్గొనాలని పరితపిస్తున్నారు.జూన్ 4 లెక్కింపు నాడు రైళ్లు, విమాన టిక్కెట్లు ఎక్కువమంది బుక్ చేసుకున్నారు. ఏపీ వైపు వచ్చే వాహనాలు సైతం ముందుగానే రిజర్వ్ అయ్యాయి. కేవలం పోలింగ్ నాడు విజయాన్ని ఆస్వాదించడానికి పదివేల మంది హైదరాబాదు నుంచి రానున్నట్లు తెలుస్తోంది. అటు విజయోత్సవానికి సంబంధించి పెద్ద ఎత్తున బాణసంచా శివకాశిలో బుక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆరోజు బాంబుల మోతతో ఏపీ దద్దరిల్లనుంది.ఎక్కడికక్కడే డీజేలుసైతం బుక్ అయినట్లు తెలుస్తోంది.విజయోత్సవ ర్యాలీలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. గత ఐదేళ్లుగా ఎన్నో రకాల అవమానాలకు గురైన టిడిపి శ్రేణులు.. విజయాన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలని బలమైన ఆకాంక్షతో ఉన్నారు.