YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సొషల్ మీడియా రీవెంజ్

సొషల్ మీడియా రీవెంజ్

విజయవాడ, తిరుపతి, మే 21
ఏపీలో ఎన్నికలు ముగిసాయి. పోలింగ్ నాడు హింస చెలరేగింది. రెండు రోజుల వరకు కొనసాగింది. ఎలక్షన్ కమిషన్ సీరియస్ యాక్షన్ కి దిగడంతో కొంతవరకు అదుపులోకి వచ్చింది. కేంద్ర బలగాలు రావడంతో అల్లర్లు తగ్గుముఖం పట్టాయి. అటు అల్లర్లకు సంబంధించి సిట్ దర్యాప్తు సైతం పూర్తి అయ్యింది. అయితే ఒక వైపు అల్లర్లు తగ్గినా.. సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున వార్ నడుస్తోంది. ప్రత్యర్థి పార్టీల నేతలను, సోషల్ మీడియా శ్రేణులకు గట్టి హెచ్చరికలు పంపుతున్నారు. కౌంటింగ్ తర్వాత తమ ప్రతాపాన్ని చూపుతామని హెచ్చరిస్తున్నారు. అయితే ఇలా హెచ్చరిస్తున్న వారంతా చదువుకున్న వారే కావడం ఆందోళన కలిగిస్తోంది.  సహజంగా రాజకీయ పార్టీలు అన్నాక అభిమానులు ఉంటారు. తమ పార్టీని, అధినేతను అభిమానిస్తుంటారు. తల్లిదండ్రులకు మించి ఆరాధిస్తుంటారు. వారిపై ఈగ వాలనివ్వరు. ముఖ్యంగా రాజకీయాల్లో సోషల్ మీడియా రంగ ప్రవేశం చేశాక పరిస్థితి చేయి దాటుతోంది. అభిమానం ఉన్మాదంగా మారుతుంది. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి పార్టీలపై దుష్ప్రచారం పెరిగింది. ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీలు సోషల్ మీడియాను పెంచి పోషిస్తున్నాయి. దీంతో అభిమానమనే ఉన్మాదంలో చెలరేగిపోతున్నారు. గత ఐదు సంవత్సరాలుగా వైసిపికి చాలామంది పనిచేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు గా మారారు. అటు ఆ పార్టీ సైతం డబ్బులు ఇచ్చి పెంచి పోషించింది.ప్రస్తుతం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరగడం, ఓటింగ్ శాతం పెరగడంతో కూటమికే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు కొంత భయపడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బెదిరింపులకు దిగుతున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా తమను వేధించారని టిడిపి శ్రేణులు, గత ఐదేళ్ల పరిణామాలతో రివెంజ్ ఉంటుందని వైసీపీ శ్రేణులు అనుమానంతో గడుపుతున్నాయి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో రచ్చ కూడా జరుగుతోంది. వైసిపి అనుకూల రంగాల వారికి టిడిపి కూటమి నుంచి.. ఆ మూడు పార్టీల మద్దతుదారులకు వైసీపీ నుంచి బెదిరింపులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీల వారీగా విశ్లేషణలు చేసే వారికి సైతం హెచ్చరికలు వస్తున్నాయి. అయితే ఇలా హెచ్చరికలు చేస్తున్నవారు చదువుకున్న వారే కావడం విశేషం. మా పార్టీ వైపు వుండు. మా పార్టీ గురించి మాట్లాడు.. మా పార్టీపై వ్యతిరేకంగా మాట్లాడితే అంతే సంగతులు అన్నట్టు వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండడం గమనార్హం. అయితేఎన్నికల కౌంటింగ్ నాటికి ఈ పరిస్థితులు మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయి. దీనిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ పై ఉంది.
పిఠాపురం, కాకినాడలో నిఘా
పోలింగ్ నాడే ఏపీలో హింసాత్మక ఘటనలు జరిగాయి.గతంలో ఎన్నడూ చూడని దృశ్యాలు వెలుగు చూశాయి.తలలు పగిలాయి. రక్తసిక్తం అయ్యాయి. ప్రధానంగా పల్నాడు, మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలో హింస చోటుచేసుకుంది. చంద్రగిరిలో అయితే టిడిపి అభ్యర్థి పులవర్తి నాని పై దాడి జరిగింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో సిట్ దర్యాప్తు పూర్తయింది. ఆ నివేదిక ఎలక్షన్ కమిషన్కు చేరుకుంది. ఒకటి రెండు రోజుల్లో అరెస్టులు కూడా జరగనున్నాయి. మరోవైపు అనుమానిత నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జూన్ 4 న లెక్కింపు పూర్తయితే.. జూన్ 19 వరకు కేంద్ర బలగాలు ఏపీలో ఉంచేలా ఆదేశాలు ఇచ్చారు.అయితే తాజాగా పిఠాపురం, కాకినాడ సిటీలో కౌంటింగ్ నాడు అల్లర్లు జరుగుతాయని కేంద్ర నిఘా సంస్థ హెచ్చరించింది. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేశారు. ఆయన గెలుపు దాదాపు ఖరారు అని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాకినాడ సిటీ నుంచి ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. గతంలో ఆయన విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ హాట్ టాపిక్. కాకినాడలో మీ రౌడీయిజాన్ని అడ్డుకుంటానని పవన్ ఎన్నడో ప్రకటించారు. కాకినాడ సిటీలో ద్వారపురెడ్డికి ప్రైవేట్ సైన్యం ఉందన్న అనుమానాలు గతం నుంచి ఉన్నాయి. మరోవైపు పిఠాపురంలో కి అల్లరి మూకలు చొరబడ్డాయని మెగా బ్రదర్ నాగబాబు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ మొత్తం పరిణామ క్రమంలో పిఠాపురం తో పాటు కాకినాడ విషయంలో కేంద్ర నిఘా సంస్థల నుంచి ముందస్తు హెచ్చరికలు రావడం విశేషం. కౌంటింగ్ కు ముందే జల్లెడ పట్టాలని పోలీసులు సైతం నిర్ణయించారు. అనుమానాస్పద వ్యక్తులపై ఇప్పటినుంచి నిఘా పెంచారు.

Related Posts