విజయనగరం, మే 22,
ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి సీక్రెట్‌గా పర్యటించడంపై రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. సోమవారం అకస్మాత్తుగా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాల పనులను పరిశీలించారు. ఇదే అంశం ఏపీ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇంతకీ సీఎస్ పర్యటన వెనుక ఏం జరుగుతోంది? ఇలా రకరకాల ప్రశ్నలు వెంటాడుతున్నాయి.ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి విజయనగరం జిల్లాకు వెళ్లారు. అక్కడ భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను పరిశీలించారు. ముఖ్యంగా టెర్నినల్ భవనంతోపాటు రన్ వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనాల పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చిన్నపాటి సమీక్ష చేయడం, అనుకున్న సమయానికి పూర్తి కావాలని కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశించారు.నిర్మాణాల పనులను జీఎంఆర్ సంస్థ చూస్తోంది. ఇదిలావుండగా నిర్మాణాల పనులు సక్రమంగా జరగలేదని ఫిర్యాదుల నేపత్యంలో సీఎం జవహర్‌రెడ్డి విజిట్ చేశారన్నది అధికారుల నుంచి బలంగా వినిపిస్తున్నమాట. సీఎస్ వస్తున్న విషయాన్ని అధికారులు గోప్యంగా ఉండడంపై ఏం జరుగుతోందన్న చర్చ రాజకీయ నేతల్లో మొదలైంది.అసలే వేసవికాలం తాగునీరు సమస్యను పక్కనబెట్టి ఎయిర్‌పోర్టు నిర్మాణాల పనులకు సీఎస్ రావడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అకాల వర్షాలు చాలా జిల్లాలను ఇబ్బందిపెట్టాయి. దీనికితోడు ఈసారి రుతుపవనాలు ముందుగా వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎన్నికల ఫలితాలకు సమయం ఉండడంతో వాటిపై దృష్టి పెట్టాల్సిన సీఎస్, భోగాపురం పనులపై ప్రత్యేకంగా రావడమేంటని అంటున్నారు.గతంలో కూడా ఆయన ఓసారి విశాఖపట్నం వచ్చారు. ఈ విషయం కూడా ఎవరికీ తెలీకుండా సీక్రెట్‌గా వచ్చారు. ఇప్పుడు భోగాపురం వంతైంది. సీఎస్ వ్యవహారశైలిని గమనించిన వాళ్లు మాత్రం వెనుక ఏదో జరుగుతుందని అంటున్నారు.