కాకినాడ, మే 22
పవన్ కళ్యాణ్ స్థానికేతరుడు. ఆయనొక సినీ సెలబ్రిటీ. ఆయన ఎక్కడుంటారో తెలియదు. స్థానికంగా ఉండరు. ప్రజా సమస్యలు పరిష్కరించలేరు.. వైసిపి ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చిన అంశాలు ఇవి. ఆయనకు ఓటు వేయొద్దని చెప్పేందుకు రకరకాల కారణాలు చూపారు. ముఖ్యంగా స్థానికేతరుడు అన్న ముద్ర వేశారు.అయితే ఇప్పుడు పోలింగ్ ముగిసింది. రెండు వారాల్లో ఫలితం తేలనుంది. ఈ తరుణంలో తనపై జరిగిన ప్రచారానికి గట్టి సమాధానం ఇచ్చారు పవన్. పిఠాపురం నియోజకవర్గంలో రంగంలోకి దిగారు. ప్రజలకు తాను అండగా ఉంటానని సంకేతాలు పంపించగలిగారు.జనసేన కు చెందిన ఓ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీనిపై వెంటనే స్పందించారు పవన్. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వర్మతో పాటు జనసేన యాక్టివ్ నాయకులను అప్రమత్తం చేశారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాల అండగా నిలవాలని ఆదేశించారు. తక్షణ సాయంగా స్వయంగా లక్ష రూపాయలను ప్రకటించారు. ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేయాలని సూచించారు. మరోవైపు పవన్ స్పందించిన నేపథ్యంలో జనసైనికులు సోషల్ మీడియా వేదికగా విరాళాలను సేకరించారు. ఇలా రెండు లక్షల రూపాయలను వసూలు చేసి బాధిత కుటుంబానికి అందించారు.అయితే ఈ విషయంలో పవన్ శరవేగంగా స్పందించడాన్ని జనసైనికులు సంతోషిస్తున్నారు. బాస్ యాక్షన్ లోకి దిగారని వ్యాఖ్యానిస్తున్నారు.పవన్ పై వైసీపీ అభ్యర్థి వంగా గీత సైతం ఎటువంటి విమర్శలు చేయలేదు. కేవలం వారి పార్టీ నాయకులు మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం ప్రారంభం నాటి నుంచి వంగా గీత పవన్ పై స్థానికేతర ముద్రకి ప్రయత్నించారు. స్థానికురాలైన తనకు కాకుండా.. పవన్ ను ఎన్నుకుంటే న్యాయం జరగదని.. తనతోనే పిఠాపురం అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. ఒక పార్టీ అధినేతగా, సినీ సెలబ్రిటీగా మీకు న్యాయం చేయలేరని కూడా పిఠాపురం ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఈ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళింది. కానీ పవన్ ఇమేజ్ ముందు పని చేయలేదు. అందుకే పవన్ స్థానికేతర ముద్ర తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎమ్మెల్యేగా గెలుపొందకముందే నియోజకవర్గానికి సంబంధించి ఇటువంటి కార్యక్రమమైన పార్టీ శ్రేణులతో జరిపిస్తున్నారు. ఆర్థిక సాయం అందిస్తున్నారు. అవసరమైతే నేరుగా తానే వస్తానని చెబుతున్నారు. అయితే పవన్ ఈ తరహా ప్రయత్నాలను జనసేన నేతలు ఆహ్వానిస్తున్నారు. మున్ముందు పవన్ స్థానికేతర ముద్రను అధిగమిస్తారని భావిస్తున్నారు.