విజయవాడ, మే 22
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాల లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయకపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పదో తేదీన హైకోర్టు ఇచ్చినపర్మిషన్‌తో రూ. 14 వేల కోట్లను గత ఐదు నెలల నుంచి బటన్లు నొక్కినప్పటికీ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయని నిధులను జమ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదు. పదమూడో తేదీన పోలింగ్ ముగిసిన వెంటనే ఆ నిధులను లబ్దిదారుల ఖాతాల్లో వేయవచ్చని ఈసీ అనుమతి ఇచ్చింది. కానీ వారంరోజులు పాటి పోయిన తర్వాత కూడా పది శాతం లబ్దిదారుల ఖాతాల్లో కూడా నగదు జమ చేయలేకపోయారు. అందుకే ఆ రూ. పధ్నాలుగు వేల కోట్ల రూపాయలను దారి మళ్లించారని అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లించారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు తమకు బిల్లులు చెల్లించాలంటూ ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు సేవలు నిలిపివేశాయి. ఇప్పుడీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల్లోనే కాదు.. లబ్దిదారుల్లోనూ చర్చనీయాంశం అవుతోంది. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు చేయూత, ఈబీసీ నేస్తం, ఆసరా, విద్యాదీవెన, కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు జగన్ బటన్ నొక్కి 5 నెలలు అయినా నిధులు జమ చేయలేదు. ఈ 6 పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు మొత్తం రూ.14,165 కోట్లు జమ చేయాల్సి ఉంది. ఈ మొత్తాన్ని పదో తేదీన జమ చేస్తామని ఈసీ కి దరఖాస్తు చేసుకున్నారు. ఐదారు నెలల నుంచి జమ చేయకుండా పోలింగ్ ముందు ఎలా చేస్తారని ఈసీ అనుమతి ఇవ్వలేదు. అయితే హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఒక్క రోజు జమ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఈసీ నుంచి ఆదేశాలు రాకపోవడంతో జమ చేయలేదు. చివరికి ఆ రోజున జమ చేయలేకపోయారు. ఇక పోలింగ్ అయిపోయిన తర్వాత 14వ తేదీన జమ చేసుకోవచ్చని ఈసీ అనుమతి ఇచ్చింది. కానీ 22వ తారీఖు వచ్చినా అరకొరగా మాత్రమే జమ చేశారు. నిధులన్నీ రెడీగా ఉన్నా ఎందుకు జమ చేయలేదన్న చర్చ ఇప్పుడు ఏపీలో జరుగుతోంది. పోలింగ్ అయిపోయిన తర్వాత ఇక లబ్బిదారులతో పనేముందని ఆ పధ్నాలుగు వేల కోట్లను దారి మళ్లిసున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. గవర్నర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఈ కారణంగా చాలా స్వల్పంగా పథకాలకు నిధులు విడుదల చేశారు. లబ్దిదారులకు మొత్తం 14 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా, కేవలం 1500 నుంచి 2000 కోట్ల వరకు మాత్రమే చెల్లించినట్లు తెలుస్తోంది. అంటే పదిశాతం కూడా విడుదల చేయలేదు. మరి పథకాల కోసం సేకరిచిన రూ. 14వేల కోట్లు ఏమయ్యాయన్నది స్పష్టత లేకుండాపోయింది. కొత్త ఆర్థికసంవత్సరంలో కొత్త అప్పులకు అనుమతి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల అమ్మకాల రూపంలో రూ. 16 వేల కోట్ల రుణాన్ని సేకరించింది. ప్రతి మంగళవారం రిజర్వ్‌బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించే ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భారీగా రుణాలు సేకరిస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల 50 రోజుల్లోనే 16 వేల కోట్లు రుణాన్ని సమీకరించింది. పథకాల కోసం సేకరించిన నిధులు, ఆర్బీఐ ద్వారా తీసుకుంటున్న అప్పులు క కాంట్రాక్టర్లకు కూడా భారీగానే చెల్లింపులు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెలా రాష్ట్ర ఖజానాకు 14 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం, కేంద్రం ఇచ్చిన నిధులు, పలు రుణాలు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులు కలిపి ఈ మొత్తం సమకూరుతుంది. రిజర్వ్‌బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను పరిశీలిస్తే రోజుకు 315 కోట్లు చొప్పున సేకరించినట్టయింది. అయినప్పటికీ ఈ మొత్తంలో అభివృద్ధికి కానీ, సంక్షేమం కోసం లబ్ధిదారులకు ఇచ్చింది కానీ నామమాత్రమేనని అంటున్నారు. నిధులన్నీ ఏమవుతున్నాయన్న ప్రశ్నకు సమాధానం రావడం లేదు.ఐదేళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సంక్షేమం పైనే దృష్టి కేంద్రీకరించారు. పథకాల లబ్దిదారులే తనకు ఓట్లేస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే గత ఆరు నెలల నుంచి ఒక్క పథకానికీ నిధులు ఇవ్వలేదు. ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆగ్రహం వ్యక్తమయింది. అలాగే కోటి మంది వరకూ ఉన్న డ్వాక్రా మహిళలకు ఇవ్వాల్సిన ఆసరా నిధులు ఇవ్వలేదు. చేయూత బటన్ నొక్కినప్పటికీ డబ్బులు ఇవ్వలేదు. పథకాల లబ్దదారులంతా ఎంతో ఆశగా తమ ఖాతాల్లో నగదు పడుతుదంని చూస్తున్నారు. కానీ ఎన్నికలకు ముందు ఇస్తామన్న ప్రభుత్వం తర్వాత ఎందుకు ఇవ్వడం లేదన్న అసంతృప్తి కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో తేడా వస్తే.. ఇక పథకాల నిధులకు ఎవరిది బాధ్యతన్న అసంతృప్తి కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి, పథకాల నిధుల గురించి అధికారులు ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. నిధులు ఖర్చు చేయాలంటే .. ఎవరికైనా చెల్లింపులు చేయాలంటే కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ కమిటీ సీఎస్ నేతృత్వంలో ఉంటుంది కాబట్టి అడ్డూ అదుపూ లేకుండా చెల్లింపులు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఓ వైపు చిన్న చిన్న కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. తమకు పదిహేను వందల కోట్లు బిల్లులు రావాలని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు సేవలు నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నాయి. రానురాను పరిస్థితి మరింత దిగజారిపోతోంది. ఇలాంటి సమయంలో అధికారులు ప్రజలకు ఆర్థిక పరిసితి గురించి.. అప్పులు తెస్తున్న నిధుల గురించి.. వాటి వినియోగం గురించి ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.