జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో పోరాటయాత్రతో బిజీబిజీగా ఉన్నారు. తనదైన శైలిలో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై, నాలుగేళ్ల పాటు కలిసి నడిచి ఇప్పుడు బయటకు వచ్చిన టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ప్రజల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తన సత్తాచాటేందుకు ఒంటరిగా రాజకీయ రణరంగంలో పోరాడుతున్న పవన్‌కు అండగా నిలబడేందుకు మెగా ఫ్యామిలీ నుంచి యువ హీరోలు సిద్ధంగా ఉన్నారు.. కానీ పవన్ ఉంచి పిలుపు రావడమే ఆలస్యం.. జనసేన తరుపున ప్రచారం చేయడానికి తాము సిద్ధమని చెబుతున్నారు.జనసేన తరుపున ప్రచారం చేయడానికి తాను సిద్ధమేనని హీరో సాయిధరమ్‌తేజ వెల్లడించారు. పవన్‌కు మెగా ఫ్యామిలీ నుంచి మద్దతు లేదని వస్తున్న వార్తల్ని ఖండించేలా యువహీరోల ప్రకటనలు ఉంటున్నాయి. ఇటీవల బాబాయ్ పవన్ తరుపున ప్రచారం చేయడాని తాను సిద్ధంగా ఉన్నానని హీరో రామ్‌చరణ్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ పవన్ స్పందన ఒకింత ఆశ్చర్యకరంగా ఉంది.. వాళ్లు ఇష్టపడి వస్తే.. తనకు అభ్యంతరం లేదనీ.. కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించుకొమ్మని చెబుతాను అని పవన్ అనడం గమనార్హం.అయితే పవన్ పిలువకపోవడానికి… మెగా హీరోలు వెళ్లకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని పలువురు నాయకులు అంటున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు జరిగినప్పుడు పరిణామాలేఇందుకు కారణమని భావిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. కానీ.. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం, అనుకున్న స్థాయిలో సీట్లు గెలవకపోవడం.. చిరంజీవి పార్టీని ఏకంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం చకచకా జరిగిపోయాయి. అప్పటి నుంచే అల్లు అరవింద్, చిరంజీవి, పవన్ కల్యాణ్ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని టాక్ వినిపిస్తోంది.ఎవరిని కూడా ప్రచారం కోసం పిలువకూడదనీ, ఒంటరిగానే రాజకీయాల్లో రాణించాలన్నది పవన్ ఆలోచనగా పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా… ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాగా, తేజ్ ఐ లవ్ యూ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమహేంద్రవరం వెళ్లిన సాయి ధరమ్ తేజ్ అక్కడ ఈ విషయాన్ని చెప్పాడు. మామయ్య పిలిస్తే.. తనవంతు సాయంగా ప్రచారంలో పాల్గొంటానని ఆయన అన్నారు. ఇంతకు పవన్ పిలుస్తాడా..? లేక వీళ్లే వెళ్తారా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది