కడప, మే 23,
వైసిపి నేతల్లో కొత్త టెన్షన్ ప్రారంభమైంది. ఒకవైపు టిడిపి కూటమికి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ప్రముఖ సెఫాలజిస్టుల విశ్లేషణ ప్రకారం వైసీపీకి ఓటమి ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అరెస్టులు, నాన్ బెయిలబుల్ కేసులు వెంటాడుతున్నాయి. పోలింగ్ నాడు, పోలింగ్ తర్వాత ఏపీలో విధ్వంసాలు జరిగిన సంగతి తెలిసిందే. మాచర్ల, పల్నాడు, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. తీవ్ర విధ్వంసం చెలరేగింది. రక్తపాతం జరిగింది. అయితే ఘటనకు కారణమైన వారిపై చిన్న చిన్న కేసులు నమోదు చేయడాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తప్పు పట్టింది. అదనపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. అదే జరిగితే హత్యాయత్నం కేసులతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడం ఖాయం. అరెస్టులు జరగడం కూడా ఖాయంగా తేలుతోంది. ఏపీలో జరిగిన అల్లర్లపై 13 మంది అధికారులతో కూడిన అత్యున్నత దర్యాప్తు బృందం సిట్ ను నియమించిన సంగతి తెలిసిందే. మూడు రోజులపాటు దర్యాప్తు చేసిన సిట్.. కీలక నివేదికలను ఈసీకి సమర్పించింది. వైసీపీ నేతలు చెప్పిన విధంగానే కిందిస్థాయి పోలీసులు వ్యవహరించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని సిట్ నివేదిక ఇచ్చింది. దీంతో ఇటు అధికారులు, అటు వైసిపి నేతల్లో ఒక రకమైన టెన్షన్ ప్రారంభమైంది. అల్లర్లకు పాల్పడిన వారిపై కీలక నేతల ఆదేశాల మేరకు బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు సీట్ గుర్తించింది. ఎంతటి విధ్వంసకాండ కు పూనుకుంటే చిన్నచిన్న కేసులతో సరిపెడతారా అని సీట్ ప్రశ్నించింది. ఎవరెవరు సిఫార్సులు చేశారో ఆరా తీసింది. దీంతో ఇప్పుడు అదనపు సెక్షన్లను జోడిస్తున్నారు. హత్యాయత్నంతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో తాము ఇరకాటములో పడడం ఖాయమని అధికార పార్టీ నేతల్లో ఒక రకమైన అలజడి కనిపిస్తోంది. పల్నాడులో సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ కేంద్రంలో దూరి.. ఈవీఎంలను నేలకొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. అడ్డొచ్చిన టిడిపి ఏజెంట్ పై దాడి కూడా చేయడంలో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించి చిన్న చిన్న కేసులు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసానికి పాల్పడినట్లు పేర్కొంటూ చిన్న చిన్న సెక్షన్ల కింద కేసు కట్టారు. ఇప్పుడు సిసి పూటేజీలో పిన్నెల్లి విధ్వంసం వెలుగులోకి రావడంతో.. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. మరోవైపు ఎక్కడికక్కడే తమను కులం పేరుతో దూషించారని ఎస్సీ ఎస్టీలు సిట్ బృందం ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఇప్పుడు అదనంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను కూడా నమోదు చేస్తున్నారు. ఒకవేళ జూన్ 4న వైసిపి ఓడిపోతే.. కేసులు నమోదైన వైసీపీ నేతలకు ముచ్చెమటలు పట్టడం ఖాయం. అదే గెలుపొందితే మాత్రం ఆ పార్టీ నేతలకు ఉపశమనం కలగనుంది.