YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బోనస్ రగడ...

బోనస్ రగడ...

నిజామాబాద్, మే 23
వరి పంటకు బోనస్ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. దీంతో అసలు రాజకీయ రగడ మొదలైంది.అసెంబ్లీ ఎన్నిక వేళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పంట బోనస్ పై హామీనిచ్చింది. రైతు ఏ రకం వరి పండించినా, ఎన్ని క్వింటాలు పండించినా… క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు గుర్తుచేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మాట మార్చి…. కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నాయి.ఇచ్చిన హామీ మేరకు దొడ్డు వడ్లకు కూడా రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ బోనస్ అంశపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బలంగా తెరపైకి తీసుకువస్తోంది. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. అప్పుడు మాట ఇచ్చి… ఇప్పుడు ఇవ్వమని చెప్పడమేంటని నిలదీస్తోంది. సన్న వడ్ల పేరుతో సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీల ఆరోపణలపై ప్రభుత్వంలోని మంత్రులు, పెద్దలు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.మరోవైపు మార్కెట్ లో సన్న వడ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుంది.దొడ్డు రకాలను తినేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. దొడ్డు వడ్లను కేవలం తెల్ల రేషన్ కార్డు వినియోగదారుల కోసమే కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేస్తుంది. అందులోనూ మెజారిటీ శాతం బియ్యం…. అడ్డదారిలో రేషన్ డీలర్లు,మిల్లర్ల వద్దకే చేరుతుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.దొడ్డు వడ్లను రీసైక్లింక్ చేస్తూ దందాకు నడుపుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. దీని ద్వారా…. ప్రభుత్వ సొమ్ముకు భారీగానే గండి పడుతోంది. ఈ తరహా దందాకు అడ్డుకట్ట వేయడానికే సన్నవడ్లను ప్రోత్సహించే ఆలోచనలో సర్కార్ ఉందన్న అభిప్రాయాలు అధికారికవర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంది. అకాల వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. మరోవైపు తరుగు,తూకం పేరిట కోతలు విధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈసారి వర్షాలు ముందుగానే పడొచ్చు అని వాతావరణ శాఖ అంచనాలు ఉండటంతో…. రైతులు విత్తనాల కోసం కేంద్రాల వద్ద క్యూలు కడుతున్నారు.రైతులకు రెండు లక్షల రుణమాఫీపై కసరత్తు చేయాల్సి ఉంది. ఇలాంటి కీలక సమస్యలు ఓవైపు ఉన్న నేపథ్యంలో…. తొందరపడి పంట బోనస్ పై ప్రకటన చేశారా అన్న చర్చ కూడా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో పంట బోనస్ పై అధికార పార్టీ నుంచి ఎలాంటి ప్రకటనలు వస్తాయనేది చూడాలి….!

Related Posts