టీడీపీకి ఎప్పుడూ కంచుకోటగా ఉంటూ వస్తోన్న రాజధాని అమరావతి ఉన్న గుంటూరు జిల్లా టీడీపీలో ఈ సారి పెద్ద ఎత్తున ప్రక్షాళన జరుగుతుందా ? అంటే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లా పార్టీలోనూ ఇదే చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం మూడు ఎంపీలతో పాటు 12 అసెంబ్లీ సీట్లను టీడీపీ గెలుచుకుంది. ఐదు అసెంబ్లీ సీట్లు మాత్రమే వైసీపీ ఖాతాలో పడ్డాయ్. వీటిల్లో మంగళగిరి 12 ఓట్లతో టీడీపీ కోల్పోతే, బాపట్ల, మాచర్ల, గుంటూరు తూర్పు కూడా 3 వేలకు కాస్త అటూ ఇటూ మెజార్టీతోనే టీడీపీ కోల్పోయింది. ఒక్క నరసారావుపేటలో మాత్రమే వైసీపీకి చెప్పుకోదగ్గ మెజార్టీ వచ్చింది.ప్రస్తుతం జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జరిగే ప్రక్షాళనలో 7-8 సీట్లలో కొత్త అభ్యర్థులు రావడం అయితే ఖరారైనట్టే. ఈ లిస్టులో పడే ఫస్ట్ సిట్టింగ్ వికెట్ మాజీ మంత్రి ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబుదే. తీవ్రమైన వ్యతిరేకతతో మంత్రి పదవి కోల్పోయిన ఆయనకు నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. అక్కడ నుంచి మరో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ పేరు వినిపిస్తోంది.ఇక గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగులకు స్థాన చలనం గ్యారెంటీయే. ఆయన్ను ఈ సారి మాచర్లకు పంపేస్తారని అంటున్నారు. కొన్ని విషయాల్లో మోదుగుల అసంతృప్తితో ఉన్నా అంతకు మించి ఆయనకు ఆప్షన్ లేదని తెలుస్తోంది. ఇక గుంటూరు ఈస్ట్ ఇన్‌చార్జ్ మద్దాలి గిరిధర్‌రావును తప్పించి అక్కడ నుంచి ముస్లింల్లో బలమైన వ్యక్తిని పోటీ చేయించనున్నారు. ఇక మంగళగిరిలో గత ఎన్నికల్లో ఓడిన గంజి చిరంజీవి వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదు. దీంతో అక్కడ ఓసీ వర్గాల్లో బలమైన వ్యక్తులను పోటీ చేయిస్తారని అంటున్నారు. నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి సాంబశివరావు పేరు ఇక్కడ పరిశీలనకు వస్తోంది.ఇక స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు నరసారావుపేటకు వెళితే సత్తెనపల్లిలో కూడా కొత్త వ్యక్తిని దింపనున్నారు. ఒకవేళ కోడెల ఇక్కడ పోటీ చేసినా నరసారావుపేటలో మరో వ్యక్తి పోటీ చేయవచ్చు. బాపట్లలో గత ఎన్నికల్లో ఓడిన అన్నం సతీష్ ప్రభాకర్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండడంతో నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగిన వేగేశన నరేంద్రవర్మకే సీటు వస్తుందని పార్టీ నాయకులే చెపుతున్నారు. వేమూరులో మంత్రి నక్కా ఆనంద్‌బాబు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన గుంటూరుకు లోకల్ కావడంతో ప్రత్తిపాడు లేదా తాడికొండకు మారతారా ? అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇక పల్నాడులో టీడీపీ వరుసగా ఓడుతోన్న మాచర్లలో ఈ సారి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల పోటీ చేస్తారనే తెలుస్తోంది. ఇక తాడికొండ, పెదకూరపాడులలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్‌కుమార్, కొమ్మాలపాటి శ్రీథర్‌బాబుపై కూడా వ్యతిరేకత ఉంది. వీరిలో శ్రవణ్‌కుమార్ ఇటీవల మరింత మైనస్ అయ్యారు. మరి వీరి విషయంలో కూడా బాబు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారా ? అన్నది కూడా ఉత్కంఠగానే ఉంది. ఏదేమైనా గుంటూరు జిల్లా టీడీపీలో ఈ సారి భారీ ప్రక్షాళన అయితే తప్పేలా లేదు.