తిరుపతి, మే 25
నగిరి లో మంత్రి రోజా చేతులెత్తేశారా? దాదాపు ఓటమి ఖాయమని ఒక అంచనాకు వచ్చారా? అందుకే సైలెంట్ గా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో నగిరి నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని రోజా భావించారు. కానీ సొంత పార్టీ శ్రేణులనుంచి ఆమెకు సహాయం అందలేదు. పోలింగ్ నాడే ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తన గెలుపు కంటే.. ఓటమికి సొంత పార్టీ నేతలు ప్రయత్నాలు చేశారన్నది ఆమె నుంచి వచ్చిన ఆరోపణ.అయితే ఇప్పుడు రోజా సైలెంట్ కావడం.. ప్రైవేటు ప్రాజెక్టుల శంకుస్థాపన టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ చేయడం.. హాట్ టాపిక్ గా మారింది.మంత్రి రోజాకు మరోసారి టికెట్ ఇవ్వద్దని సొంత పార్టీ నేతలే జగన్ ను కోరారు. కానీ విభేదాలు సమసిపోతాయని జగన్ భావించారు. రోజాకు టిక్కెట్ కేటాయించారు. అయితే ఆమె అసమ్మతి నేతలతో ఎటువంటి సర్దుబాటు చేసుకోలేదు. వారిని కలుపు కెళ్లే ప్రయత్నం చేయలేదు. ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టు వ్యవహరించారు. తీరా పోలింగ్ సమయానికి ఆమెకు తత్వం బోధపడింది. పార్టీ శ్రేణుల నుంచి పూర్తిగా సహాయ నిరాకరణ ఎదురైంది. దీంతో పోలింగ్ నాడు మధ్యాహ్నం ఆమె సొంత పార్టీ శ్రేణులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరోక్షంగా ఓటమిని అంగీకరించారు అన్న కామెంట్స్ కూడా ప్రారంభమయ్యాయి.మరోవైపు టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ ఎమ్మెల్యే అయిపోయారన్న రేంజ్ లో ప్రచారం ప్రారంభమైంది. ఓ జిమ్ ప్రారంభోత్సవం సందర్భంగా నగిరి పట్టణం వ్యాప్తంగా ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో కాబోయే ఎమ్మెల్యే అంటూ గాలి భాను ప్రకాష్ ను పేర్కొన్నారు. అయితే నగిరిలో చీమ చిటుక్కుమన్న రోజా స్పందించేవారు. అటువంటిది ఇంకా గెలుపొందకుండానే గాలి భాను ప్రకాష్ ను ఎమ్మెల్యేగా పేర్కొనడంపై ఆమె స్పందించలేదు. ఆమెకు ఓడిపోతానన్న సమాచారమైనా ఉండాలి. లేకుంటే ఫలితాలు వచ్చిన తరువాత చూసుకుందాంలే అన్న నిర్ణయానికి వచ్చైనా ఉండాలి. మొత్తానికైతే నగిరి లో రోజా వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.