నెల్లూరు, మే 25,
వైసీపీలో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో సీట్ల గెలుపుపైనే చర్చ జరుగుతుంది. గత ఎన్నికల్లో పదికి పది స్థానాలను వైసీపీ గెలుచుకుంది. పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఫ్యాన్ గిరగిరా తిరిగింది. కానీ ఈసారి నెల్లూరులో కొంత అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై భారీ ఎత్తున బెట్టింగ్ లు పోలింగ్ పూర్తయిన నాటి నుంచే ప్రారంభమయ్యాయని అంటున్నారు. ఎంత స్థాయిలో అంటే ఏపీలోనే ఏ నియోజవకర్గంలో జరగని బెట్టింగ్ లు నెల్లూరు జిల్లాలోని ఒక నియోజకవర్గంపై నడుస్తున్నాయి. వివిధ పార్టీల నేతలతో పాటు అనేక మంది పెద్ద స్థాయిలో ఈ నియోజకవర్గంపై బెట్టింగ్ లు జోరుగా కడుతున్నారని సమాచారం. అదే కోవూరు నియోజకవర్గం. కోవూరు నియోజకవర్గంపై బెట్టింగ్ లు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఎకరానికి రెండు ఎకరాల భూమి కూడా బెట్టింగ్ లో పెడుతున్నారంటే అతిశయోక్తి కాదు. నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుందని కొందరు... లేదు... లేదు.. ఖచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుందని మరొక వైపు బెట్టింగ్ లు నడుస్తున్నాయి. లక్షల రూపాయల బెట్టింగ్ లు ఈ కోవూరు నియోజకవర్గంపై జరగడానికి అనేక కారణాలున్నాయి. ఇద్దరు హేమాహేమీలు పోటీపడుతుండటమే అందుకు కారణం. పెద్ద స్థాయిలోనే బెట్టింగ్ లు ఇప్పటికే ప్రారంభం కావడంతో రాను రాను ఇంకెంత స్థాయిలో అయినా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో వైసీపీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. మరోవైపు టీడీపీ తరుపున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన వాళ్లకు మళ్లీ గెలవరు. ఒకసారికి ఒకపార్టీకి అవకాశమిస్తే, రెండోసారి మరోపార్టీకి అవకాశం ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. 1999లో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గెలిస్తే 2004లో టీడీపీ నుంచి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గెలిచారు. 2009లో తిరిగి నల్లపురెడ్డి గెలిచారు. అయితే ఆ తర్వాత 2012లో జరిగిన ఉప ఎన్నికలో సెంటిమెంట్ తో మరొకసారి నల్లపురెడ్డి విజయం సాధించారు. 2014లో తిరిగి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గెలిచారు. 2019 లో మళ్లీ నల్లపురెడ్డి విజయబావుటా ఎగురవేశారు. ఇలా ఒకసారి గెలిస్తే మరొకసారి ఓటమి పాలు కావడం రివాజుగా వస్తుంది. వైసీీపీ నుంచి పోటీ చేస్తున్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. ఆయన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ఆయన కుటుంబానికి మంచి పేరుంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎంతో కొంత అసంతృప్తి ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, సామాజికవర్గం, జగన్ ను ఒంటరిని చేసి అందరూ ఏకమయ్యారన్న భావనతో ఒక బలమైన సామాజికవర్గం కోవూరులోనూ ఏకమయిందని అంటున్నారు. తాము ప్రభావం చూపగలిగే ఓటర్లను వైసీపీ వైపు మళ్లించడంలో సక్సెస్ అవుతామని వైసీపీ గట్టిగా నమ్ముతుంది. అందుకే వైసీపీ గెలుపును కోవూరు నియోజకవర్గంలో ఎవరూ ఆపలేరంటున్నారు. అందుకే పెద్ద యెత్తున బెట్టింగ్ లు వైసీపీ పక్షాన కట్టేందుకు కూడా నేతలు వెనకాడకపోవడానికి కారణంగా చూపుతున్నారు.