YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జూన్ లో పదవుల జాతర

జూన్ లో పదవుల జాతర

హైదరాబాద్, మే 25
సార్వత్రిక సమరం ముగియడంతో ఇప్పుడు అంతా స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవులపై ఫోకస్‌ పెడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్దిమందికి నామినేటేడ్‌ పదవులు వరించినా, ఇంకా భర్తీ చేయాల్సినవి చాలానే ఉన్నాయి. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు పదవుల కోసం తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటినా, పార్టీలోని చాలా మంది నేతలకు నామినేటెడ్ పదవులు ఇంకా దక్కలేదు. సంక్రాంతిలోపే ఈ పదవులను భర్తీ చేస్తామని గతంలో రేవంత్ ప్రకటించారు. అయితే, కొన్ని పరిస్థితుల వల్ల పెద్ద సంఖ్యలో భర్తీ ఆలస్యమవుతూ వచ్చింది. లోక్ సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని రేవంత్ వ్యూహం. ఈ విషయంపై ఇప్పటికే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారంతెలంగాణలో వరుసగా ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికలు పూర్తి కాగా 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. జూన్ నెలాఖరుకు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ దిశగా కసరత్తు మొదలయింది.   అదే జూన్ నెలాఖరులోగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలనే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో సీఎంతో సహా 12 మంది మంత్రులున్నారు. మరో ఆరుగురికి ఈసారి అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం అనుమతి తీసుకున్నట్లు సమాచారం. అయితే, మంత్రులుగా ఎవరిని తీసుకోవాలనే దానిపై రేవంత్‌కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎన్నికల కోడ్, ఆ తర్వాత ఊపిరి సలపనంతగా లోక్ సభ ఎన్నికల ప్రచారం, స్టార్ క్యాంపెయినర్‌గా పొరుగు రాష్ట్రాలకు వెళ్లి కాంగ్రెస్ తరపున ప్రచారం, ఇలా ఇన్నాళ్లూ బిజీబిజీగా ఉన్న రేవంత్, మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వచ్చారు.జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఉండనున్నాయి. ఈ ఎన్నికలలో ఏఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎలా పనిచేశారు. పార్టీ విజయానికి ఎలా తోడ్పడ్డారు అనే అంశాలను పరిశీలించి బాగా కష్టపడ్డ వారికే మంత్రి పదవులు ఉంటాయని భావిస్తున్నారు. మరోవైపు, సీనియర్లు తమ అనుకూలమైన వారికి పదవుల కోసం అధిష్టానం దగ్గర ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టారని సమాచారం. కొత్తగా మంత్రి వర్గంలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నవారిలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల వారికి ముందుగా ఛాన్స్ ఉంటుందంటున్నారు. అలాగే, రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.ప్రస్తుత కేబినెట్‌లో ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. నల్గొండ నుంచి ఉత్తమ్‌ కుమార్, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, వరంగల్ నుంచి కొండా సురేఖ, సీతక్క, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌ బాబు ఉన్నారు. ఇక హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా కాంగ్రెస్‌లోకి వలస వస్తే వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. రైతు రుణమాఫీ పూర్తి చేసి.. కొత్త కేబినెట్, నామినేటెడ్ పదవుల ద్వారా పూర్తి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రైతు రుణమాఫీ పైన బ్యాంకర్లతో ప్రభుత్వం చర్చలు చేస్తోంది. దీంతో, జూన్ ద్వితీయార్ధంలో రాష్ట్రంలో మరోసారి రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

Related Posts