YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆరోదశ ఎన్నికల్లో భారీ పోలింగ్

ఆరోదశ ఎన్నికల్లో భారీ పోలింగ్

న్యూఢిల్లీ, మే 25
దేశ రాజధాని ఢిల్లీలోని ఒక పోలింగ్‌ కేంద్రంలో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము తన ఓటు వేశారు. రాష్ట్రపతి భవన్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ బూత్‌కు వెళ్లి ఓటు వేశారు. రాష్ట్రపతి అయిన తర్వాత ద్రౌపదీ ముర్ము తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేశారు. ఇక ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ఆయన సతీమణి సుదేశ్‌ క్యూలైన్‌లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తొలి గంటల్లో ఓటేశారు. అలాగే, పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే ఉదయం 7 గంటలకు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసిన తొలి వ్యక్తి ఈయనే కావడంతో అధికారులు ఆయనకు సర్టిఫికేట్‌ కూడా ఇచ్చారు. ఆ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ఎక్స్‌(ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.
ఒక గాంధీ కుటుంబం శనివారం ఢిల్లీలో ఓటు వేసింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు న్యూఢిల్లీ స్థానంలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం రాహుల్ గాంధీ కూడా తల్లి సోనియా గాంధీతో సెల్ఫీ దిగి పంచుకున్నారు. ప్రియాంక కుమార్తె మిరయా, కుమారుడు రేహాన్‌ వాద్రా క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సోనియా, రాహుల్, ప్రియాంక ఓటు వేసిన స్థానం నుంచి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరూ లేరు. ఆప్‌తో పొత్తు కారణంగా ఈసారి న్యూఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టలేదు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సోమనాథ్ భారతి బరిలో ఉన్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బన్సూరి స్వరాజ్ బరిలో ఉన్నారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబంతో ఓటు వేశారు

Related Posts