YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైదరాబాద్ ఇక ఉమ్మడి కాదు...

హైదరాబాద్ ఇక ఉమ్మడి కాదు...

ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయి పదేళ్లు పూర్తవుతున్నాయి. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇకపై తెలంగాణ సొంతం కానుంది. పది సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత కూడా ఏపీకి-తెలంగాణ కు మధ్య ఉమ్మడి ఆస్తులు, సంస్థల విభజన కొలిక్కి రావడం లేదు.  ఉమ్మడి ఆస్తుల విభజనకు సంబంధించి  కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 32 సార్లు, రెండు రాష్ట్రాల అధికారులు అనేకసార్లు చర్చించినా ఫలితం లేకపోయింది. దీంతో వాటాలు తేలని సంస్థల భవనాల్లో అనేకం నిరుపయోగంగా ఉండిపోయాయి. ఇప్పుడు తెలంగాణ సీఏం రేవంత్ రెడ్డి ఈ సమస్యపై దృష్టి నిలపాలని అధికారులకు సూచించారు. ఏపీలో కూడా ఎన్నికల కౌంటింగ్ పూర్తయి కొత్త సర్కారు కొలువుతీరిన తర్వా త రెండు రాష్ట్రాలు దీనిపై చర్చించే అవకాశం ఉంది. పేచీలేని ఆస్తులను జూన్ 2 తర్వాత తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం అయింది.
9, 10 షెడ్యూళ్లలో పేర్కొన్న కొన్ని సంస్థల్లో ఉద్యోగులు, చరాస్తుల విభజన జరిగినప్పటికీ స్థిరాస్తులు, అప్పుల విభజన అలాగే ఉండిపోయాయి. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్తో పాటు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్, మినరల్ డెవలప్మెంట్ లాంటి సంస్థల విభజనపై గందరగోళం నెలకొంది. మరికొన్ని సంస్థల్లో ఉమ్మడి ఖాతాల కింద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపైనా స్పష్టత లేదు.
విభజన చట్టంలోని సెక్షన్ 64 ప్రకారం ఉమ్మడి సంస్థల ఆస్తులను జనాభా నిష్పత్తికి అనుగుణంగా  58 : 42 నిష్పత్తిలో పంచాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. అందుకు తెలంగాణ అంగీకరించడం లేదు.  9, 10 షెడ్యూళ్ల సంస్థలతో పాటు ఏ షెడ్యూల్లో చేర్చని 12 ఉమ్మడి సంస్థలు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్నాయి. ఈ 12 తో కలిపి మొత్తం ఉమ్మడి సంస్థలు 245 వీటి మొత్తం ఫిక్స్డ్ ఆస్తుల విలువ రూ.1.42 లక్షల కోట్లని అంచనా.
9వ షెడ్యూల్లో 89 ప్రభుత్వ రంగ సంస్థలను చేర్చినప్పటికీ నమోదైన కంపెనీలు 70 మాత్రమే. మిగిలినవి అనుబంధ సంస్థలు. అయితే ఇన్ని సమస్యలకు మూలం మాత్రం విభజన చట్టం రూపొందించేటప్పుడు నాటి కేంద్ర సర్కారు రాష్ట్ర సంస్థల పునర్వ్యవస్థీకరణ, రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన సూత్రాలు, విధానంపై తగినంత శ్రద్ధ చూపలేదు. అలాగే ఆస్తులు, అప్పుల పంపిణీ కోసం ‘షీలా బిడే’ అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన్పటికీ, ఆ కమిటీ సిఫార్సులు పూర్తిగా అమలుకాలేదు.
10వ షెడ్యూల్లోని జాబితాలో చేర్చిన 142 సంస్థల్లో 9 విశ్వవిద్యాలయాలు కాగా, 16 సంస్థలు ప్రభుత్వ శాఖల్లో అంతర్భాగంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య 10వ షెడ్యూల్ సంస్థల సిబ్బంది, ఆస్తుల పంపిణీపై విభజన చట్టం ఏమీ చెప్పలేదు.ఇక 9వ షెడ్యూల్లో పేర్కొన్న మెజారిటీ సంస్థల ప్రధాన కార్యస్థానం హైదరాబాద్. వీటిని అవశేష ఆంధ్రప్రదేశ్లో తిరిగి ఏర్పాటు చేయడానికి చాలా కాలం పడుతుంది. హైదరాబాద్‌లోని ఆస్తుల విభజనపై చాలాకాలంగా ప్రతిష్ఠంభన నెలకొంది.

Related Posts