YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎలక్షనీరింగ్ లో టీడీపీ పైచేయి..?

ఎలక్షనీరింగ్ లో టీడీపీ పైచేయి..?

విజయవాడ, మే 28
బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటూ చంద్రబాబు పై ఎన్నికలకు ముందు చాలా మంది సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. బీజేపీతో పొత్తు కొన్ని వర్గాలను దూరం చేస్తుందని మొత్తు కున్నారు. కానీ చంద్రబాబు వినిపించుకోలేదు. ఆయన లెక్కలు ఆయనకుంటాయి. ఆయన వ్యూహం ఆయనకు తప్ప మరొకరికి తెలియదు. ఆఖరి నిమిషంలో మాత్రం చంద్రబాబు ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నది ఇప్పుడు అర్థమయి ఆరోజు తాము చేసిన వ్యాఖ్యలు సరికాదన్న నిర్ధారణకు వచ్చినట్లయింది. ఎందుకంటే ఇప్పుడు కాక పోతే మరెప్పుడు అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలంటే బీజేపీ తో పొత్తు అనివార్యమని చంద్రబాబు నమ్మారు. అందుకే ఎవరేమనుకున్నా సరే పెద్దగా పట్టించుకోలేదు. తాను అనుకున్న దారిలోనే ఆయన వెళ్లారు.  ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతున్న పరిస్థితులను చూస్తే మాత్రం అందరికీ అర్థమయింది. వైసీపీ నేతలను ఎలా కట్టడి చేయగలిగారో ఆయన తన వ్యూహం ద్వారా చెప్పకనే చెప్పారు. ఒకరకంగా అధికార పార్టీపై ఎలక్షనీరింగ్ లో చంద్రబాబు పై చేయి సాధించినట్లే కనపడుతుంది. వైసీపీ నేతలను కేంద్ర సాయంతో కీలకమైన చోట్ల కట్టడి చేయగలిగారంటే అది బీజేపీతో పొత్తుతోనే సాధ్యమయిందన్నది వాస్తవం. జగన్ ను ఈ ఎన్నికల్లో ఎదుర్కొనాలంటే ఒంటరిపోరు సరిపోదు అని ఆయన ఎప్పుడో అంచనాకు వచ్చారు. 2019 ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చిన నాటి నుంచే బీజేపీతో సయోధ్యకు ప్రయత్నించారు. 2018 లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసినప్పటీకీ దానిని దాటుకుని బీజేపీని దరి చేర్చుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ పాత్ర కొంత మేర పనిచేస్తే.. తనకు ఉన్న పాత పరిచయాలు, ఆర్ఎస్ఎస్ నేతలతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకున్న చంద్రబాబు బీజేపీ గట్టు దాటి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. గెలవాలంటే పోలింగ్ సక్రమంగా జరగాలి. అదీ తమకు అనుకూలంగా మారాలి. అందుకోసమే ఆయన ఎవరెన్ని అన్నా పెద్దగా పట్టించుకోలేదు. తాను అనుకున్నట్లుగానే ముందుకు వెళ్లారు. అలా వెళ్లిన చంద్రబాబుతో కొంత ఆలస్యమయినా బీజేపీ నేతలు కలసి వచ్చారు. దీంతో రాష్ట్రంలో అధికార యంత్రాంగం కూడా ఆయన చేతి కిందకు వచ్చినట్లయింది. అధికార పార్టీని కాదని అనేక చోట్ల అధికారులు విపక్ష కూటమికి అండగా నిలిచారన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం చంద్రబాబు స్ట్రాటజీ అని చెప్పక తప్పదు. అలా ముందు నుంచి చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం నరుక్కుంటూ వచ్చారు. చివరకు తాను అనుకున్నది సాధించగలిగారు.  ఎన్నికల అనంతరం... ఎన్నికల అనంతరం జరిగిన పరిస్థితులను చూసిన వారికి ఎవరికైనా ఇదే అనిపించక మానదు. వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. అధికార యంత్రాంగం తీరును తప్పు పడుతున్నారు. వైసీపీకి పట్టున్న పల్నాడు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో చంద్రబాబు తన బలగంతో సాధ్యం కాని పనిని అధికారుల అండతో చాలా వరకూ విజయం సాధించారు. పేర్ని నాని, కాకాణి గోవర్థన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వైసీపీ నేతలు ఈసీ పైన, పోలీసు అధికారులపైన విమర్శలు చేస్తున్నారంటే ఏదో జరిగిందనే అనుమానం అందరికీ కలుగుతుంది. చంద్రబాబు కూడా ఫలితాలపై ఏమీ మాట్లాడకపోవడం కూడకా అనేక సందేహాలకు తావిస్తుంది. ఇలా చంద్రబాబు ముందు నుంచి జగన్ ను కట్టడి చేయడానికి అనుసరించిన వ్యూహం అధికారుల పరంగా విజయవంతంగా ముగించగలిగారు. మరి పోలింగ్ లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారన్నది మాత్రం ఇంకా సస్పెన్సే. ఎందుకంటే.. అధికారుల అండ నిలిచినంత మాత్రాన సక్సెస్ అయినట్లు కాదు. ఏకపక్షంగా పోలింగ్ జరగకుండా నిరోధించడంలో మాత్రం చంద్రబాబు సక్సెస్ అయ్యారు. మరి ఫలితాలు ఎలా ఉండనున్నాయన్నది చూడాల్సి ఉంది.

Related Posts