ఏలూరు, మే 28,
నిజంగా పుష్ప సీనే. అది పనసకాయలు తరలిస్తున్న వాహనం. చూసే వారికి అది ఫ్రూట్స్ ట్రాన్స్‌పోర్ట్ చేసే వాహనంగానే కనిపిస్తోంది. కాని కింది భాగం తెరిచే చూస్తే మాత్రం దాని వెనకాల అసలు రంగుబయట పడుతుంది. పనసకాయల మాటున గంజాయి తరలిస్తున్న నిందితుల ఆపరేషన్ ఇది. అశ్వారావుపేటలో పనసకాయల లోడ్‌లో దాచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి హైదరాబాద్‌కు మినీ ప్యాసింజర్ వాహనంలో 359 కిలోల బరువున్న 89 లక్షలకు పైగా విలువైన గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను కొత్తగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనం కింది భాగంలో ఓ బాక్సును ఏర్పాటు చేసుకుని కొన్ని రోజులుగా ఈ ముఠా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా వాహనాన్ని చెకింగ్ చేయగా వాహనం కింది భాగంలో 359 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులను అదుపులోకి తీసుకున్న తీసుకున్న పోలీసులు.. వారికున్న లింకులపై కూపీ లాగుతున్నారు.మరో కేసులో భద్రాచలం వద్ద ప్లైవుడ్ షీట్ల కింద దాచి ఉంచిన 427 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, డ్రగ్స్ తరలిస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు. నిందితులు తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌లోని మూసాపేటకు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ కోటి పైనే ఉంటుందని తెలిపారు.మూడో కేసులో జిల్లాలోని అశ్వాపురంలో మరో సందర్భంలో 249 కిలోల 62 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లగేజీ క్యాబిన్‌లోని కస్టమ్ మేడ్ కంపార్ట్‌మెంట్లలో, ప్రయాణికుల సీట్ల కింద ఉన్న కంపార్ట్‌మెంట్లలో గంజాయిని దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.