YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎక్కడి సమస్యలు అక్కడే

ఎక్కడి సమస్యలు అక్కడే

విజయవాడ, మే 28  రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతోంది. కానీ ఇంతవరకు విభజన హామీలకు అమలుకు నోచుకోలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబుసర్కార్ కొంతవరకు విభజన హామీల గురించి పట్టించుకుంది. అందుకే కెసిఆర్ తో వైరం తెచ్చుకుంది. కానీ 2019 నుంచి 2024 వరకు జగన్ సర్కార్ విభజన హామీల గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం నాటి కెసిఆర్ సర్కార్ పై చంద్రబాబు వేసిన కేసులను కూడా.. జగన్ విత్ డ్రా చేసుకున్నారు. కెసిఆర్ తో రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ పాకులాడారు అన్న విమర్శ ఉంది. గత ఐదు సంవత్సరాలుగా విభజన హామీల అమలు కనీస స్థాయిలో కూడా జరగలేదు. ఇప్పుడు జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కొత్త రచ్చ ప్రారంభమైంది.ఉమ్మడి రాజధానిగా హైదరాబాదున విభజన చట్టంలో పొందుపరిచారు. 2024 జూన్ రెండు వరకు గడువు విధించారు. ఇంతలో ఏపీ రాజధాని అభివృద్ధి చేసి.. తరువాత హైదరాబాద్ రాజధాని నుంచి వెనక్కి రావాలన్నది లక్ష్యం. వాస్తవానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఎందుకు పనికి రాలేదు. రాష్ట్ర శాసనసభ తో పాటు లేక్ వ్యూ అతిథి గృహాన్ని ఏపీకి కేటాయించారు. కానీ తెలంగాణ శాసనసభను ధ్వంసం చేసిన కెసిఆర్ దాని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించారు. ఆ సమయంలో జగన్ నోరు కూడా తెరవలేదు. లేక్ వ్యూ అతిథి గృహానికి సంబంధించి ఏపీ ఎటువంటి అవసరాలు తీర్చుకోవడం లేదు. కేవలం చంద్రబాబును విమర్శించడానికి, కేసుల విషయం ప్రస్తావించడానికి, ప్రెస్ మీట్ లు పెట్టేందుకు మాత్రమే ఆ భవనాన్ని వినియోగిస్తున్నారు.అయితే ఉమ్మడి రాజధాని అంశం గడువు ముగుస్తుండడంతో.. మరి కొద్ది రోజుల పాటు ఉమ్మడి రాజధాని మీ కొనసాగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని విషయాన్ని ప్రస్తావించని నేతలు సైతం.. ఇప్పుడు రాజకీయాల కోసం దానిని వాడుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. రెండు రోజుల కిందట తెలంగాణలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మద్దతు తెలిపారు. అదే జెడి లక్ష్మీనారాయణ ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును మరికొన్ని సంవత్సరాలు పాటు కొనసాగించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ డిమాండ్ వెనుక రాజకీయ కోణం ఉందన్న ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మొన్నటివరకు తెలంగాణలో అధికారంలో ఉన్నకెసిఆర్ అధికారానికి దూరమయ్యారు.ఇప్పుడు ఏపీలో జగన్ దూరమవుతారన్న ప్రచారం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో ఉమ్మడి రాజధాని హైదరాబాదును మరికొన్ని రోజులు పాటు కొనసాగించాలన్న డిమాండ్ వెనుక రాజకీయ కోణం ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు మిత్రులుగా ఉన్న కేసీఆర్, జగన్ ఉమ్మడి కార్యాచరణలో భాగంగానే ఈ డిమాండ్ వస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Related Posts