నెల్లూరు, మే 28
ప్రస్తుతం ఏపీలో 2019 ఎన్నికల సీన్ కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో అధికార పార్టీగా టిడిపి ఉండేది. కానీ ఎన్నికల సంఘంపై నాడు టిడిపి చాలా రకాల ఆరోపణలు చేసింది. ఈవీఎంల పనితీరుతో పాటు అప్పట్లో వైసీపీ రిగ్గింగ్ చేసింది అని కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది. రీపోలింగ్ కు డిమాండ్ చేసింది. ఈసీ నుంచి సానుకూలమైన స్పందన రాకపోయినా.. తామే గెలుస్తామని టిడిపి నేతలు ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు నాటి టిడిపి పాత్రను వైసిపి పోషిస్తోంది. ఈ ఎన్నికలపై నమ్మకం లేదన్నట్టు.. ఈసీ ఎన్నికల నిర్వహణలో ఫెయిల్ అయిందని.. రీపోలింగ్ నిర్వహించాలని.. రకరకాలుగా డిమాండ్ చేస్తూ వస్తోంది.గత ఎన్నికల్లో ప్రధాన అధికారిక గోపాలకృష్ణ ద్వివేది ఉండేవారు. నాడు ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు రావడంతో.. ఎన్నికలకు ముందు కీలక అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని మార్చేశారు. డిజిపి తో పాటు ఇంటలిజెన్స్ ఐజిని కూడా బదిలీ చేశారు. కీలక జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ముందు బదిలీ అయ్యారు. చివరకు కడపలో వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్న ఎస్పీకి సైతం స్థాన చలనం కల్పించారు. అప్పట్లో ఎన్నికల అక్రమాలపై టిడిపి నేతలు వరుసగా ఫిర్యాదులు చేశారు. కానీ ఈసీ స్పందించలేదు. అయినా సరే గెలుస్తామని టిడిపి నేతలు ధీమా వ్యక్తం చేసేవారు. కానీ ఫలితాలు చూస్తే దారుణంగా వచ్చాయి. టిడిపి నేతల అంచనాలు తారుమారయ్యాయి.గత ఎన్నికల్లో చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. రాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. దీంతో చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగినంత పని చేశారు. అయితే ఇప్పుడు జగన్ తరుపున వైసీపీ నేతలు అదే మాదిరిగా రంగంలోకి దిగారు. వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో వైసీపీకి టిడిపికి పట్టిన గతి పట్టిందన్న కామెంట్స్ ప్రారంభమయ్యాయి. టిడిపి భారీగా రిగ్గింగ్ చేసిందని.. అవకతవకలకు పాల్పడ్డారని.. వైసిపి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. రీపోలింగ్ కావాలని కోరుతోంది. భయపడినట్టు కనిపిస్తోంది. అయితే ఈ పరిణామాలన్నీ చూస్తే.. నాడు టిడిపికి ఎదురైనవే నన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.